మృతి కేసు మాఫీకి రూ.2.5 లక్షలు!

22 Jun, 2018 02:07 IST|Sakshi
బ్యూటీపార్లర్‌లో మృతదేహం వద్ద విలపిస్తున్న మృతురాలి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేత (సర్కిల్‌లో)

యువతి ప్రాణానికి వెలకట్టిన టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు..

తల్లిదండ్రులను బెదిరిస్తూ మృతదేహం వద్దే వేలంపాట

రేపల్లె బ్యూటీపార్లర్‌లో అనుమానాస్పద మృతి కేసుపై పలు అనుమానాలు

రేపల్లె: ఓ బ్యూటీపార్లర్‌లో చనిపోయిన యువతి మృతి కేసు మాఫీ కోసం టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ఆమె మృతదేహం వద్దే వేలంపాట నిర్వహించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరు జిల్లా రేపల్లెలోని డూ అండ్‌ డై బ్యూటీపార్లర్‌లో తెలంగాణలోని యాదాద్రి జిల్లా రెడ్లరేపాలెంకు చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని సిరి తల్లిదండ్రులు చెబుతున్నా.. వారిని బెదిరిస్తూ.. కేసును మాఫీ చేసేందుకు వేలంపాట నిర్వహించారు. 

హైదరాబాద్‌లో ఉంటున్న సిరి బుధవారమే ఈ బ్యూటీపార్లర్‌లో ఉద్యోగంలో చేరింది. ఉరిపోసుకున్నట్లు చెబుతున్నా.. ఆమె గదిలోని దుస్తులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం సందేహాలను రేకెత్తిస్తోంది. బ్యూటీపార్లర్‌లో జరుగుతున్న ‘వ్యవహారాలకు’ ఒప్పుకోకపోవడం లేదా బయటకు చెబుతానని బెదిరించడం వల్లే ఆమెను నిర్వాహకులే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాను ప్రేమించిన యువకుడు మృతిచెందటంతో మనస్తాపానికి గురై.. యువతి ఉరి వేసుకుని మృతిచెందిందంటూ బ్యూటీపార్లర్‌ నిర్వాహకులు కొత్త కథనం తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారమే మృతికి కారణం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా... బ్యూటీ పార్లర్‌ అసలు నిర్వాహకురాలి జాడలేకపోవడం గమనార్హం.

కాంగ్రెస్‌ నేత సమక్షంలో..
కేసు మాఫీ కోసం బ్యూటీపార్లర్‌ నిర్వాహకుల స్థానంలో అంతా తానై ఓ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజీ ప్రయత్నాలు చేశారు. సిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ విలపిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఉర్మిళ, యాదయ్యలను, బంధువులను బెదిరిస్తూ.. మృతదేహం ఉన్న గదిలోనే ఆమె మృతి కేసు మాఫీకి పాట నిర్వహించారు. నిర్వాహకుల తరఫున రూ.2.50 లక్షలకు మధ్యవర్తిత్వం చేశారు.

అనంతరం సిరి తల్లిదండ్రులు, బంధువులను బయటకు పంపించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ముఖ్య ప్రతినిధి ఒకరు ఓ పోలీసు అధికారికి ఫోన్‌ చేసి కేసు మాఫీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత తంతు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఈ బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలి తండ్రి 2001లో పట్టణంలో జరిగిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. హత్య కేసు అనంతరం వడ్రంగి పనిచేసే వ్యక్తి చిన్నచిన్నగా కలప వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు.  బ్యూటీపార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని, రాత్రి సమయాల్లోనూ పురుషుల రాకపోకలు అధికంగా ఉంటాయని చుట్టుపక్కలవారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు