ఎంతపని చేశావు తల్లీ..!

14 Aug, 2018 07:51 IST|Sakshi
గీతిక మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు (ఇన్‌సెట్‌) గీతిక మృతదేహం

కడప అర్బన్‌ : తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో రెండవ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్న గీతిక (19) ఈనెల 12న సాయంత్రం తాను ఉంటున్న శివజ్యోతి నగర్‌లోని ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సహచర విద్యార్థుల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. గీతిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం సోమవారం సాయంత్రం కడప నగరంలోని మారుతీనగర్‌కు తీసుకుని వచ్చారు. గీతిక తల్లి, సమీప బంధువులు, చుట్టు పక్కల వారు ఆమె మృతదేహాన్ని పట్టుకుని ‘ఎంతపని చేశావు గీతికా’ అంటూ బోరున విలపించారు. ఇంతకాలం తమ కళ్లముందే ఆడుతూ, పాడుతూ కనిపించిన గీతిక ఉన్నట్లుండి బలవన్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

పరీక్షల భయంతోనో..  వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆమె తల్లి హరితాదేవి, బంధువులు మీడియాకు వెల్లడించారు. ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదని వారు కన్నీటి పర్యంతమయ్యారు.  సంఘటన జరిగిన వెంటనే అక్కడి ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కడపలోని మారుతీనగర్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి గీతిక మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకునివచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య గీతిక మృతదేహానికి అంత్యక్రియలను పూర్తి చేశారు.

 
జిల్లాకు చెందిన ఇద్దరు మెడికోలు అకాల మరణం
జిల్లాకు చెందిన వారే ఇద్దరు మెడికోలు అకాల మరణం చెందారు. జిల్లాలోని సింహాద్రిపురానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి కుమారుడు హర్షప్రణీత్‌ రెడ్డి కర్నూలు మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసిస్తూ అనుమానాస్పద స్థితిలో హాస్టల్‌లో మృతి చెందాడు. తర్వాత ఆ సంఘటనపై విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాజాగా కడప మారుతీనగర్‌కు చెందిన విజయభాస్కర్‌ రెడ్డి, హరితాదేవిల ఏకైక కుమార్తె గీతిక బలవన్మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 

మెడికల్‌ కాలేజీలో విషాద ఛాయలు

తిరుపతి అర్బన్‌: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్యలు చేసుకోవడంతో కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు తనువు చాలించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుస సంఘటనలు జరగడంతో కళాశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న  ఎంబీబీఎస్‌ విద్యార్థిని పి.గీతిక మృతదేహాన్ని సోమవారం ఆయన రుయా మార్చురీలో పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

రుయా ప్రభుత్వ వైద్యులు, జూడాల సంఘం నాయకులు సోమవారం మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సభ్యురాలు లావణ్య తదితరులు హాజరై ఇద్దరు వైద్య విద్యార్థుల చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు.
దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ
గీతిక మృతదేహానికి రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్ధానాయక్‌ ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ గీతిక మృతి పూర్తిగా వ్యక్తిగతమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ డివిజన్‌ మెజిస్ట్రేట్‌(ఆర్‌డీవో), తహసీల్దార్‌ల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వెల్లడించారు.  కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. గీతిక మృతికి మెడికల్‌ కాలేజీలో ఎలాంటి వేధింపులు గానీ, ఇతర సమస్యలు గానీ లేవని, విద్యలో వెనుకబాటుతనం మాత్రమే ఉందని ఆమె తల్లి చెప్పినట్లు  స్పష్ట్టం చేశారు. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌లో కూడా ఎవరిపేర్లు లేవని, ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని డీఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు