ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్‌..!

21 May, 2019 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ జరిగింది. ఐసీఎస్‌ అధికారి, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి నేత శ్రీశైలం మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వేరోస్‌ మెంబర్స్‌ శ్రీశైలంపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక న్యూస్‌ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా స్వేరోస్‌ సభ్యులు దాడి చేశారు. దాడి ఘటనపై శ్రీశైలం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

దారుణాలను ఎండగడతారనే దాడి..!
దళిత నేత  శ్రీశైలంపై స్వేరోస్‌ సభ్యుల దాడిని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌ ఖండించారు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్‌ అండదండలతో స్వేరోలు రెచ్చిపోతున్నారని, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గురుకుల పాఠశాలల్లో చేరి గచ్చిబౌలిలో, ఆదిలాబాద్‌, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. తమ బాగోతాన్ని బయటపెడతాడనే స్వేరోలు శ్రీశైలంపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంపై దాడి చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని కిరణ్‌ డిమాండ్‌ చేశారు. 

స్వేరోస్‌ (స్టేట్‌ వెల్ఫేర్‌ ఎయిరో) అంటే జాతి సంక్షేమం కోసం ఆకాశం (అనంతం) హద్దుగా పనిచేసేవారు అని అర్థం. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో 2012 అక్టోబర్‌ 19న ఈ సంస్థను స్థాపించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ

మరిన్ని వార్తలు