స్వామీజీ వేషం.. ఆత్మ పేరుతో మోసం

11 Mar, 2020 07:14 IST|Sakshi
స్వామిజీ వేషంతో ఉన్న రామకృష్ణ(ఫైల్‌) ,పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

కటకటాలపాలైన నిందితుడు  

కారు స్వాధీనం చేసుకున్నపోలీసులు 

చిత్తూరు, మదనపల్లె టౌన్‌ : అతడిది స్వామీజీ వేషం.. నమ్మించి మోసం చేయడం..భూతవైద్యం పేరు తో లక్షలు దండుకోవడం అతడి అకృత్యాలు. ఈ క్రమంలోనే ఓ మహిళను మోసగించి కటకటాల పాలయ్యాడు. మృతి చెందిన ఆమె భర్త ఆత్మ ఇంట్లో తిరుగుతోందని.. ఆ దెయ్యాన్ని వెళ్లగొడతానని నమ్మించి ఆరు లక్షల రూపాయలు లాక్కుని మాయమయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతని వ్యవహారం బయటపడింది. వన్‌ టౌన్‌ సీఐ తమీమ్‌ అహ్మద్, ఎస్‌ఐ లోకేష్‌ మంగళవారం విలేకరులకు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ, రాయునిచెరువు వడ్డిపల్లె(ఆర్‌సీ వడ్డిపల్లె)కు చెందిన లేట్‌ వెంకటప్ప కుమారుడు డేరంగుల రామకృష్ణ అలియాస్‌ రామకృష్ణ స్వామిజీ(47) ఒకప్పుడు చిన్న చిన్న కూలి పనులతో కాలం వెళ్లదీసేవాడు. 15 ఏళ్ల క్రితం గుప్తనిధుల ముఠాలో చేరి జిల్లాతో పాటు పలు మండలాల్లో గుప్త నిధులను వెలికితీసేవాడు.

అక్కడ నకిలీ విగ్రహాలను పెట్టి జనాన్ని నమ్మించి రూ.లక్షలు దండుకునేవాడు. ఇంతటితో ఆగకుండా స్వామిజీ వేషంతో భూతవైద్యాలు చేసేవాడు. ఇదిలా ఉండగా.. మదనపల్లె బుగ్గకాలువకు చెందిన షేక్‌ హసీనా భర్త మస్తాన్‌ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇంటిలో మస్తాన్‌ ఆత్మ తిరుగుతోందని, గుప్త నిధులు ఉండడం వల్లే అలా జరుగుతోందని ఆమెను నమ్మించాడు. తాను ఎంతో మందికి భూతవైద్యం చేసి దెయ్యాలను వెళ్లగొట్టానని.. అలా ఇక్కడ కూడా చేస్తానని ఆమెను నమ్మించి రూ.6 లక్షలు తీసుకున్నాడు. తరువాత స్వామిజీ కనిపించకుండా మాయమయ్యాడు. అనుమానించిన బాధితురాలు మోసపోయానని నాలుగు రోజుల క్రితం వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి కల్యాణ మండలం సర్కిల్‌ వద్ద కారులో వెళుతుండగా పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు