కారు చోరీ.. ఆపై దర్జా..

23 Jun, 2020 10:58 IST|Sakshi
నిందితుడు మహ్మద్‌ అదిల్‌ ,పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

కేపీహెచ్‌బీకాలనీ: సమాజంలో ధనవంతుడిగా కనిపించాలనే కోరికతో ఓ యువకుడు కారును దొంగిలించి దర్జాగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేసన్‌ పరిధిలో జరిగింది.  సోమవారం సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు..బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఈర్షద్‌ ఆలం కుటుంబం నగరానికి వచ్చి పటాన్‌చెరు ప్రాంతంలో ఉంటున్నారు. ఇతని కుమారుడు అదిల్‌ హాసన్‌(23) కేపీహెచ్‌బీకాలనీలోని హోలిమేరి డిగ్రీ కాలేజిలో రెండవ సంవత్సరం వరకూ చదివి మానేశాడు.  తరువాత స్విగ్గిలో డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు.  అయితే అందరి ముందు బాగా డబ్బున్న వాడిగా కనిపించాలనే కోరికతో కారు ఉంటే అందరూ తనను బాగా డబ్బున్న వాడు అనుకుంటారని భావించాడు.

ఈ నెల 19న బైక్‌పై నిజాంపేట చౌరస్తా వద్ద గల పిస్తా హౌస్‌ వద్దకు వచ్చి బైక్‌ను పార్కు చేశాడు.  అనంతరం కార్లు నిలిపే చోటుకు వచ్చి వాలెట్‌ పార్కింగ్‌ డ్రైవర్‌గా నమ్మించి అక్కడకు వచ్చిన మారుతి స్విఫ్ట్‌ కారును సెల్లార్‌లో పార్కు చేస్తానంటూ కారు యజమాని వద్ద తాళాలు తీసుకున్నాడు.  కానీ కారును సెల్లార్‌లో పార్కు చేయకుండా కారును దొంగిలించుకువెళ్ళాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం నిజాంపేట చౌరస్తా వద్ద మఫ్టీలో ఉన్న పోలీస్‌లు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటువైపుగా కారులో వచ్చిన అదిల్‌ హాసన్‌ కారుకు చెందిన పేపర్లు చూపించకుండా తప్పించుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకొని విచారింగా నేరాన్ని ఒప్పుకున్నాడు.  దీంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు