ఊయలే.. యమపాశమైంది !

1 Jun, 2019 10:49 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబ సభ్యులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు (ఫైల్‌)

జడ్చర్ల టౌన్‌ : వేసవిసెలవులకు తాతవద్దకు వచ్చి చీరతో చేసిన ఊయలతో ఆడుకుంటుండగా ఆ ఊయలే యమపాశంగా మారి ఆనంద్‌ (9) అనే బాలుడు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని గంగాపూర్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గంగాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింహులు కుమారుడు కుమార్‌–అనిత దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వలస వెళ్లారు. అక్కడ హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లో పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరూ తాత వద్దకు వచ్చారు. అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో చీరతో కట్టిన ఊయలతో బాలుడు ఆనంద్‌ ఆడుకుంటూ ఉన్నాడు. కుటుంబ సభ్యులందరూ మరో గదిలో ఉండటంతో బాలుడిని ఎవరూ గమనించలేదు. ఊయల ఊగుతుండగా చీర బాలుడి మెడకు బిగుసుకుని శ్వాస ఇబ్బంది తలెత్తింది.

కొద్దిసేపటికి తాత నర్సింహులు ఆ గదిలోకి వచ్చి చూడగా మనవడి మెడకు ఊయల బిగుసుకుని ఉండటం గమనించి వెంటనే చీరను తొలగించి బాదేపల్లిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని చెప్పడంతో బాలుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆ బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చిన మనువడు విగతజీవిగా మారడంతో తాతతోపాటు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం సాయంత్రం బాలుడి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గతనెలలో ఇదే గ్రామంలో ఐదేళ్ల చిన్నారి కారులో ఊపిరాడక మృతిచెందిన విషయం మరువకముందే ఊయలతో బాలుడు మృతిచెందటం గంగాపూర్‌ వాసులను కలచివేస్తుంది.

మరిన్ని వార్తలు