స్వైపింగ్‌ దందా!

18 Jun, 2018 11:18 IST|Sakshi

పక్కదారి పడుతున్న ‘నగదు రహితం’

ఏటీఎం, బ్యాంకుల్లో నగదు కొరత

కమీషన్‌పై డబ్బులు ఇస్తున్న వ్యాపారులు

జోరుగా సాగుతున్న కమీషన్‌ వ్యాపారం

తణుకుకి చెందిన సత్యనారాయణ తన తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే రూ.20 వేలు చెల్లించాలని చెప్పారు. సత్యనారాయణ బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేలు ఉన్నాయి. దీంతో డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరిగాడు. నో క్యాష్‌.. బ్యాంకుకు వెళ్లినా పనికాలేదు. ఒక వైపు ఎమర్జెన్సీ కావడంతో ఏం చేయాలో ఆందోళన చెందుతున్న సత్యనారాయణకు తన స్నేహితుడు ఒక వ్యాపారి గురించి చెప్పాడు. ఆయన వద్దకు వెళ్లి ఏటీఎం కార్డు చేతిలో పెట్టి రూ.20 వేలు కావాలని అడిగాడు. స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా తన ఖాతాలోకి రూ.20 వేలు మళ్లించుకున్న వ్యాపారి.. సత్యనారాయణ చేతిలో రూ.19,500 పెట్టాడు. ఇదేమని అడిగితే మీకు ‘పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి నేనేమైనా బ్యాంకు నడుపుతున్నానా.. మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు టాక్సులు పడతాయి. ఈ ఖాతాలో డబ్బులు వాడినందుకు రేపు మాకు లేనిపోని తలనొప్పులు వస్తాయి’ అంటూ దబాయించాడు. దీంతో చేసేదేమీ లేక సత్యనారాయణ డబ్బులు తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు.ఇది ఒక్క సత్యనారాయణ పరిస్థితి మాత్రమే కాదు.. నగదు కొరతతో చాలా మంది ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. 

తణుకు : నగదు కొరత సమస్య ఇప్పటికీ జిల్లాలో పట్టిపీడిస్తోంది. సొమ్ముల కోసం సామాన్యులు నానా పాట్లు పడుతున్నారు. వారి అవసరాలను కొం దరు వ్యాపారులు ఆసరాగా తీసుకుని సొమ్ములు చేసుకుంటున్నారు. నగదురహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్‌ మెషీన్ల ద్వారా కమీషన్‌ పద్ధతిలో డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. ప్రభుత్వం నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు వ్యాపారులు స్వైపింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేసుకోవాలని గతంలో ఆదేశించింది. ఓ మోస్తరు వ్యాపారం నిర్వహించే వారు సైతం మెషీన్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తమ వ్యాపార లావాదేవీల కోసం మెషీన్లు వాడకుండా కమీషన్‌పై డబ్బులు ఇచ్చేందుకు కొందరు వ్యాపారులు వినియోగిస్తున్నారు. వ్యాపార లావాదేవీలైతే లెక్క చెప్పాల్సి రావడంతో ఇలా పెద్ద మొ త్తంలో కమీషన్‌పై డబ్బులు ఇస్తూ దందా నిర్వహిస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో తమ వద్దకు వచ్చిన వ్యక్తితో ఉన్న పరిచయాలు.. అవసరాలను ఆసరాగా చేసుకుని కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రూ.100 కోట్ల బ్యాంకు లావాదేవీలు
జిల్లాలో సుమారు అన్ని బ్యాంకులకు సంబంధించిన బ్రాంచిలు సుమారు 650 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 1200 వరు ఏటీఎంలు ఉన్నాయి. సాధారణంగా జిల్లాలో నిత్యం రూ. 100 కోట్ల మేర నగదు లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. అయితే పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు లావాదేవీలు సగానికి పైగా పడిపోయాయి. మరోవైపు బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, ఏటీఎంల్లో నగదు కొరత కారణంగా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్డు ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే పన్నుల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో వినియోగదారులు ఈ విధానంపై ఆసక్తి చూపడంలేదు. మరోవైపు పొలం పనులు, పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు ఇలా నగదు అవసరం ఎక్కువగా ఉంటోంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం, బ్యాంకుల్లో అరకొరగానే నగదు ఇస్తుండటంతో ప్రజలు ఈ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ‘మాకు డబ్బులు ఇచ్చినందుకు మేం బ్యాంకుల్లో టాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తీసుకుంటున్నాం’ అంటూ 2 నుంచి 5 శాతం వరకు కమీషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

రూ.10 కోట్ల మేర స్వైపింగ్‌ ద్వారా..
జిల్లాలో రోజూ సుమారు రూ.10 కోట్ల మేర స్వైపింగ్‌ మెషీన్ల ద్వారానే చెల్లింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తణుకుకి చెందిన ఒక వ్యాపారి రోజుకు రూ.10 లక్షల వరకు స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా కమీషన్‌ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. సగటు 3 శాతం కమీషన్‌ వసూలు చేసినా రోజుకు కనీసం రూ.30 వేలు వరకు సంపాదిస్తున్నారు. కేవలం వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోలు బంకులు, మద్యం దుకాణాల్లో ఈ కమీషన్‌ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. స్వైపింగ్‌ మెషీన్ల ద్వారా బిల్లులు చెల్లించినందుకు ఎలాంటి కమీషన్‌ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మా సొమ్ములకు కూడా కమీషన్‌ ఇస్తున్నాం
ఏటీఎంల్లో ఎప్పుడు చూసినా నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో అవసరం కోసం వ్యాపారి వద్దకు వెళితే స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా 3 నుంచి 5 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు. రూ.10 వేలకు రూ.300 తీసుకుంటున్నారు. మా డబ్బులు మేం తీసుకునేందుకు కూడా కమీషన్లు ఇవ్వాల్సి వస్తోంది.– జీవీఎన్‌ మూర్తి, ప్రైవేట్‌ ఉద్యోగి, తణుకు

ఏటీఎంల్లో నగదు ఉంచాలి
నగదు ఎక్కడా దొరకడం లేదు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండటంలేదు. ఏ ఏటీఎంకు వెళ్లినా సొమ్ములు ఉండటంలేదు. చేబదులు కూడా దొరక్కపోగా అప్పు పుట్టడంలేదు. వ్యాపారుల వద్ద మాత్రం స్వైపింగ్‌ మెషీన్ల ద్వారా నిమిషాల్లో డబ్బులు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉంచాలి.           – ఎం.రాంబాబు, రైతు, తణుకు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా