వివాదాస్పదంగా తాడికొండ ఎస్‌ఐ వైఖరి

29 Aug, 2019 09:24 IST|Sakshi
అక్రమ అరెస్టును నిరసిస్తూ స్టేషన్‌ ముందు బైఠాయించిన వైఎస్సార్‌ సీపీ నాయకులను విరమించాలని సూచిస్తున్న ఎస్‌ఐ రాజశేఖర్‌ (ఫైల్‌)

నాడు అలా.. నేడు ఇలా !

సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌ సీపీని కించపరిచినా కేసు నమోదు చేయని వైనం

టీడీపీ హయాంలో చిన్నపాటి ఫిర్యాదుకే నాన్‌బెయిలబుల్‌ కేసు

అక్రమంగా అరెస్టులు చేయించిన వైనం

సాక్షి, తాడికొండ: తాడికొండ ఎస్సై రాజశేఖర్‌ వైఖరి నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులకు ఎస్సై తొత్తుగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి.  పోలీసులు ఏ ఒక్క పక్షానికి కొమ్ముకాయకూడదన్న కనీస ధర్మాన్ని విస్మరించి పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా ఎస్సై వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులు, శ్రేణులు తప్పులు చేసి ఠాణాకు వచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు టీడీపీపై ఉన్న ప్రేమానురాగాలు పరాకాష్టకు చేరాయి.

కంతేరు గ్రామంలో  మట్టి  అక్రమ తవ్వకాల వ్యవహారంలో టీడీపీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నల్లమట్టిని తరలిస్తున్న ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్‌ నిర్వాహకుడిని బంధించి వారితో వైఎస్సార్‌ సీపీ నాయకులే మట్టి తరలించమని చెప్పారని చెప్పించేందుకు తీవ్రంగా యత్నించారు. ఇందులో భాగంగా కంతేరు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి వీడియోలు తీస్తూ బెదిరించిన వ్యవహారం బయటకు రావడంతో తాడికొండ వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి ఎస్‌ఐ రాజశేఖర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్సై పక్కన  పడేశారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కేసు నమోదు చేయడం గమనించాల్సిన విషయం.

గతంలోనూ ఇదే పరిస్థితి..
ఎస్సై రాజశేఖర్‌ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలోనూ వాస్తవాలు పక్కనపెట్టి కేసులు నమోదు చేసి వైఎస్సార్‌ సీపీ నాయకులను వేధింపులకు గురిచేశాడు. 2018 జనవరిలో వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై సోషల్‌ మీడియా కేసు బనాయించి కనీసం స్టేషన్‌ బెయిల్‌ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. బండారుపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు టపాసులు కాల్చుతూ రాకెట్‌కు చంద్రబాబు నరకాసురుడు అని రాసి పైకి ఎగరేశారు.

ఈ ఘటనలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గుంటుపల్లి రాంబాబుపై టీడీపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఓ వ్యక్తితో నామమాత్రపు ఫిర్యాదు ఇప్పించి అక్రమంగా అరెస్టు చేసి బెయిల్‌ కూడా ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించారు. కానీ నాడు సంబంధిత వీడియోలో కేసు నమోదు చేసిన వ్యక్తులు కానీ టపాసులు కాల్చిన చిన్నారులు కానీ కనిపించలేదు. కేవలం కేసు నమోదు చేసిన వ్యక్తి  ఫేస్‌బుక్‌లో ఆ వీడియోను షేర్‌ చేశాడనే నెపంతో అక్రమ కేసు బనాయించడం విశేషం. ఘటనపై స్పందించిన నాటి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీక్రిస్టినా, సురేష్‌ కుమార్‌ దంపతులు రాత్రి 12 గంటల వరకు స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేసినా కనీసం స్పందించిన దాఖలా లేదు. 

నేడు అందుకు విరుద్ధం.. 
నాడు రాంబాబు తప్పు లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసిన ఎస్సై నేడు టీడీపీ నాయకులు మట్టి తరలింపు వ్యవహారంలో ట్రాక్టర్‌ డ్రైవర్లు, వెంచర్‌ యజమానిని వేధిస్తూ పక్కా ఆధారాలతో దొరికినా వారిపై కేసు నమోదు చేయడం లేదు. ఇది ఎస్సై ఏకపక్ష ధోరణికి ప్రత్యేక్ష నిదర్శనంగా నిలుస్తోంది. 

చదవండి: వివాదాస్పదంగా ఎస్‌ఐ వినోద్‌ వ్యవహారశైలి

మరిన్ని వార్తలు