ఏసీబీ వలలో బాచుపల్లి తహసీల్దార్‌

23 Aug, 2019 12:20 IST|Sakshi
తహసీల్దార్‌ ఎన్‌వై. గిరి

జగద్గిరిగుట్ట: రెవెన్యు స్కెచ్‌ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన బాచుపల్లి తహసీల్దార్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ  సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి  బి.శ్రీనివాస్‌రావు అనే బిల్డర్‌ జూలై 31న హెచ్‌ఎండిఏ అనుమతి కోసం నిజాంపేట్‌లోని సర్వే నంబర్‌ 243లోని ప్లాట్‌ నంబర్లు 13,14,15 సుమారు 900 గజాల స్థలానికి సంబందించి రెవెన్యూ లోకేషన్‌  స్కెచ్‌ కోసం మండల సర్వేయర్‌ ద్వారా తహసీల్దార్‌ ఎన్‌ వై. గిరిని సంప్రదించాడు. వెంటనే స్కెచ్‌ ఇవ్వడం కుదరదని  20 రోజులు పడుతుందని చెప్పాడు. తనకు అత్యవసరంగా స్కెచ్‌ ఇవ్వాలని శ్రీనివాస్‌రావు కోరగా రూ. లక్ష డిమాండ్‌ చేశాడు. దీంతో ఆగస్టు 5న శ్రీనివాస్‌రావు తహసీల్దార్‌ను కలిసి రూ . 50 వేలు ఇవ్వగా మర్నాడు వస్తే స్కెచ్‌ ఇస్తానని చెప్పాడు. 9న శ్రీనివాస్‌రావు మరో సారి అతడిని సంప్రదించగా ప్లాట్‌లు 13,14,15 సర్వే నంబర్‌ 243లో రావడం లేదని, రెవెన్యూ స్కెచ్‌ అవసరం లేదని చెప్పాడు. స్కెచ్‌ అవసరం లేనప్పుడు  తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్‌ రావు కోరగా, 14న అతడికి రూ.40 వేలు తిరిగి ఇచ్చాడు. రూ. 10 వేలు ఖర్చయినట్లు తెలిపాడు.  దీంతో శ్రీనివాస్‌ రావు ఏసీబీ అధికారులను కలిసి ఆడియో, వీడియో ఆధారాలు అందజేశాడు. గురువారం బాచుపల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయంపై దాడి చేసిన అధికారులు తహసీల్దార్‌ ఎన్‌వై గిరితో పాటు అతడికి సహకరించి డ్రైవర్‌ సయీద్‌ను అరెస్ట్‌ చేశారు.  దాడుల్లో ఇన్స్‌పెక్టర్లు రఘునందన్, రాజేశ్, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌ రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు