-

అంకిత్‌ శర్మ హత్య: తాహిర్‌పై ఆప్‌ వేటు

28 Feb, 2020 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటలిజెన్స్‌ బ్యూరో కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా అంకిత్‌ మృతికి కారణంగా భావిస్తున్న తాహిర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు అంకిత్‌ను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాహిర్‌ పథకం ప్రకారమే అంకిత్‌ను హత్య చేయించాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాహిర్‌ అనుచరులే ఈ దారుణానికి ఒడిగట్టారని అంకిత్‌ తండ్రి, ఐబీ అధికారి రవిందర్‌ శర్మ ఆరోపణలు గుప్పించారు.(ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్‌ మృతదేహం)

ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన తాహిర్‌ హత్యలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘హుస్సేన్‌ ఇంటిపై కొంతమంది ముసుగులు ధరించి ఉన్నారు. వారంతా చేతిలో కర్రలు పట్టుకుని హల్‌చల్‌ చేశారు. రాళ్లు, బుల్లెట్లు, పెట్రోల్‌ బాంబులు కిందకి విసిరారు. నాకు తెలిసి అతడు ఫోన్లో కేజ్రీవాల్‌, ఆప్‌ నేతలతో మాట్లాడి ఉంటాడు’’ అంటూ బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఆరోపించారు. తాహిర్‌ ఇంటికి సంబంధించిన వీడియోలో వాళ్లంతా దాడికి యత్నించిన తీరు కనిపిస్తుందని పేర్కొన్నారు. కాగా కపిల్‌ మిశ్రా వల్లే ఘర్షణలు చెలరేగాయని.. ఓ గుంపు తన ఇంట్లోకి ప్రవేశించడంతో తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నించామని తాహిర్‌ పేర్కొన్నారు. పోలీసుల సహాయం కోరినా వారు సకాలంలో స్పందించలేదని వాపోయారు. ఇక ఢిల్లీ ఘర్షణలకు కారణం ఎవరైనా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని... వారు ఆప్‌కి చెందినవారైతే శిక్షలు రెండింతలు కఠినంగా ఉంటాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


ఐబీ కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మ(ఫైల్‌ ఫొటో)

మరిన్ని వార్తలు