విజయారెడ్డి డ్రైవర్‌ గురునాథం మృతి.. విషాదంలో కుటుంబం

5 Nov, 2019 11:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కామళ్ల గురునాథం మంగళవారం మృతి చెందాడు. సోమవారం రైతు దాడిలో అగ్నికి ఆహుతైన విజయారెడ్డిని రక్షించేందుకు గురునాథం తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో అతడికి కూడా నిప్పు అంటుకోవడంతో దాదాపు 85 శాతం శరీరం కాలిపోయింది. దీంతో గురునాథాన్ని అపోలో డీఆర్‌డీఎల్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మరణించాడు. కాగా విజయారెడ్డి డ్రైవర్‌ గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. అతడికి భార్య, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య ఏడు నెలల గర్భిణి. ఇక గురునాథం మరణవార్త తెలిసిన నేపథ్యంలో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయ్యో పాపం అంటూ పలువురు అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కాగా అందరూ చూస్తుండగానే తహసీల్దార్‌ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహమైన విషయం విదితమే. రైతు సురేశ్‌ పెట్రోల్‌తో చేసిన దాడిలో తొలుత మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది అయోమయానికి గురయ్యారు. తహశీల్దార్‌ గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి భయంతో అని కేకలు పెట్టారు. ఈ క్రమంలో మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహశీల్దార్‌గా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక విజయారెడ్డిని కాపాడేందుకు ఆమె కారు డ్రైవర్‌ గురునాథ్, అటెండర్‌ చంద్రయ్య ముందుకురాగా వారు సైతం మంటల్లో కాలిపోయారు. దీంతో వారిని కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గురునాథ్‌ మంగళవారం మరణించగా.. చంద్రయ్య 50 శాతం కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నాడు. 

మరిన్ని వార్తలు