33 మందిని చంపిన సీరియల్‌ కిల్లర్‌

12 Sep, 2018 19:16 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు జైకరణ్‌ ప్రజాపతి అలియాస్‌ ఆదేశ్ ఖమ్ర

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మండీదీప్‌ పట్టణానికి చెందిన ఆదేశ్‌ ఖమ్రా(48) టైలర్‌గా పనిచేస్తూ జీనవం సాగిస్తున్నాడు. పగటిపూట టైలరింగ్‌ చేసే ఆదేశ్‌.. రాత్రయితే చాలు నరరూప రాక్షసుడిగా మారిపోయేవాడు. రోడ్డున పోయే లారీలను లిఫ్ట్‌ అడిగే అతను, డ్రైవర్, క్లీనర్లను లక్ష్యంగా చేసుకొని కిరాతకంగా చంపేసేవాడు. అనంతరం లారీలోని సొత్తు, నగదుతో ఉడాయించేవాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 33 మందిని ఆదేశ్‌ కిరాతకంగా చంపేశాడు. దీంతో ఈ హత్యలపై దృష్టి సారించిన పోలీసులు.. యూపీలోని ఓ అటవీప్రాంతాన్ని 3 రోజుల పాటు జల్లెడ పట్టి ఆదేశ్‌ను పట్టుకున్నారు. విచారణలో నిందితుడితో పాటు అతని అనుచరులు చెబుతున్న విషయాలు విని పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

2010 నుంచి మొదలైన హత్యాకాండ..
ఈ ఆపరేషన్‌లో ఆదేశ్‌ను పట్టుకున్న పోలీస్‌ అధికారిణి, భోపాల్‌ ఎస్పీ బిట్టూ శర్మ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ‘2010లో తొలిసారి మహారాష్ట్రలోని అమ్రావతి, నాసిక్‌ జిల్లాల్లో లారీ డ్రైవర్, క్లీనర్ల హత్యలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు విస్తరించాయి. తాజాగా కొన్నిరోజుల క్రితం ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లో రెండు హత్యలు జరిగాయి. అన్నింటిలో పోలీసులకు ఒక్క ఆధారమూ లభించలేదు. చనిపోయినవారందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లే కావడంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాం. పక్కా సమాచారంతో ముఠా నాయకుడు ఆదేశ్‌తో పాటు అనుచరులు ప్రజాపతి, తుకారాంలను యూపీలోని సుల్తాన్‌పూర్‌ అడవులను 3 రోజు ల పాటు గాలించి పట్టుకున్నాం’ అని చెప్పారు.

కుదిరితే మత్తుమందు లేదంటే విషం..
ఆదేశ్‌ రాత్రి కాగానే ఇద్దరు అనుచరులతో కలసి రోడ్డుపైకి వచ్చి లారీలను లిఫ్ట్‌ అడిగేవాడని ఎస్పీ బిట్టూశర్మ తెలిపారు. ‘లారీ ఎక్కగానే వారితో కలుపుగోలుగా మాట్లాడుతూ తనను డ్రైవర్, క్లీనర్‌ నమ్మేట్లు చేసేవాడు. అనంతరం తాను పార్టీ ఇస్తానంటూ డ్రైవర్, క్లీనర్‌కు మద్యం ఇప్పించేవాడు. వాటిలో ఈ ముఠా సభ్యులు ప్రజాపతి, తుకారాంలు మత్తుమందు కలిపేవారు. ఇది తాగిన కొద్దిసేపటికి వీరు స్పృహ కోల్పోగానే వెంట తెచ్చుకున్న పొడవైన తాడుతో గొంతుకు ఉరివేసి చంపేసేవాడు.  ఎందుకు చంపుతున్నావని అనుచరులు అడిగితే వీరంతా కష్టాల్లో ఉన్నారనీ, వారికి తాను విముక్తి ప్రసాదిస్తున్నట్లు చెప్పేవాడు. అప్పుడప్పుడు అనుచరులు బాధితులకు మద్యంలో మత్తు మందుకు బదులుగా విషం కూడా ఇచ్చేవారు’ అని శర్మ చెప్పారు. మృతుల వివరాలు తెలియకుండా ఉండేందుకు వారిని నగ్నంగా ఎత్తయిన కొండప్రాంతాల్లో, బ్రిడ్జీల సమీపంలో పడేసేవాడన్నారు.

దయ్యం కథలతో...
ఈ ముఠా నుంచి నిజాలను రాబట్టేందుకు పోలీసులు దయ్యాలు, భూతాల గురించి చెబుతున్నారు. ఈ విషయమై ఎస్పీ రాహుల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘తొలుత ఆదేశ్‌ను విచారించడం కష్టమవుతుందనే భావిం చాం. అయితే అతను చంపిన వ్యక్తులు ఆత్మలు, భూతాలుగా మారి అతని కుటుంబాన్ని పీడిస్తున్నాయని చెప్పాం. గత 4 నెలల్లో రెండుసార్లు అతని కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలిపాం. చేసిన తప్పులను ఒప్పుకుని ప్రాయశ్చిత్తంగా ఆ ఆత్మలను క్షమాపణలు కోరుకోకుంటే అతని కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని హెచ్చరించాం. దీంతో మేం అనుకున్నట్లే అతను పశ్చాత్తపపడటంతో పాటు తాను 33 హత్యలు చేశానని అంగీకరించాడు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు