మూక హత్య కేసులో మరో ట్విస్ట్‌

23 Jul, 2018 09:00 IST|Sakshi

జైపూర్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్‌ మూక హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడన్న అనుమానంతో గత శుక్రవారం రక్బర్‌ ఖాన్‌ (28) అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో అతను మరణించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల నిర్లక్ష్యమే బాధితుడి మృతికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ అక్బర్‌ ఖాన్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రికి తరలించకుండా బాధితుడిని 3గంటల 45 నిమిషాల పాటు పోలీస్‌ కస్టడీలో ఉంచారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో కేసును స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌కు బదిలీ చేసినట్లు, పోలీసుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు జైపూర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌  హేమంత్‌ ప్రియదర్శి తెలిపారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..
దాడి జరిగినట్లు పోలీసులకు అర్థరాత్రి 12.41 సమాచారం ఇచ్చామని, వారు 1,20కు ఘటనాస్థలికి వచ్చినట్లు స్థానిక మానవ హక్కుల కార్యకర్త నవల్‌ కిషోర్‌ తెలిపారు. బురదతో ఉన్న బాధితుడు రక్బర్‌ ఖాన్‌కు పోలీసులు స్నానం చేయించారని, అనంతరం తన ఇంటికి వచ్చి ఆవులను తరలించడానికి వాహనం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో పోలీసులు బాధితుడిపై చేయిచేసుకున్నట్లు కిషోర్‌ కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. అతను అప్పుటికి బతికే ఉన్నాడని కూడా తెలిపారు. మరోవైపు బాధితుడు గాయాలతో అరుస్తున్నా.. పోలీసులు పట్టించుకోకుండా టీ తాగుతూ కాలక్షేపం చేశారని కిషోర్‌ పేర్కొన్నారు. అనంతరం తను ఆవులను గోశాలకు తీసుకెళ్లానని, పోలీసులు బాధితుడిని స్టేషన్‌ తీసుకెళ్లారని చెప్పారు. ఇక ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా.. పోలీసులు బాధితుడి తీసుకొచ్చేలోపు అతను మరణించాడని స్పష్టం చేశారు.

రక్బర్‌ ఖాన్‌, అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తుండగా.. అల్వార్‌ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. అస్లాం వారి నుంచి తప్పించుకోగా రక్బర్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాధితుడి మరణానికి పోలీసులు కూడా కారణమని ఆరోపణలు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ ఘటన పట్ల సీరియస్‌గా ఉన్నారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్‌ జిల్లాలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్‌ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్‌ అహ్మద్‌ నవంబర్‌లో మృతిచెందాడు.

చదవండి: రాజస్తాన్‌లో మూక హత్య..

మరిన్ని వార్తలు