గవర్నర్‌పై ఆరోపణలు.. జర్నలిస్ట్‌ అరెస్ట్‌

9 Oct, 2018 14:34 IST|Sakshi
గవర్నర్‌పై ఆరోపణలు చేసినందుకు గాను ‘నక్కీరన్‌’ గోపాల్‌ అరెస్ట్‌

చెన్నై : తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌పై తప్పుడు కథనం రాసినందుకు గాను ప్రముఖ జర్నలిస్ట్‌ ‘నక్కీరన్‌’ గోపాల్‌ను మంగళవారం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్‌ ప్రస్తుతం తమిళ మ్యాగ్‌జైన్‌ ‘నక్కీరన్‌’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మ్యాగ్‌జైన్‌ తమిళనాడు ప్రోఫెసర్‌ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ప్రచురించింది. మార్కులు కావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ ప్రొఫెసర్‌ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ క్రమంలో ఆమె గవర్నర్‌ వద్దకు కూడా విద్యార్థులను తీసుకెళ్లిందని నక్కీరన్‌ తన కథనంలో పేర్కొన్నారు. అంతేకాక ‘గవర్నర్‌ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్‌ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారు. అందుకే గవర్నర్‌ ఈ కేసుపై విచారణ చేసేందుకు అంగీకరించడం లేదు’ అంటూ నక్కీరన్‌ తన కథనంలో రాసుకొచ్చారు. దీంతో నక్కీరన్‌పై రాజ్‌భవన్‌ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్‌ ఖండించారు. నిందితురాలైన ప్రొఫెసర్‌ నిర్మలా దేవీని తాను ఎప్పుడూ కలవలేదని ఆయన వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు రిటైర్డ్‌ ఉన్నతాధికారి ఆర్‌.సంథమ్‌ను గవర్నర్‌ నియమించారు.

ఈ క్రమంలో గవర్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించినందుకు గాను నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గోపాల్‌ అరెస్ట్‌ను తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డీఎమ్‌కే ప్రెసిడెంట్‌ ఎమ్‌కే స్టాలిన్‌ ఖండించారు. బీజేపీ, అధికార ఏఐడీఎమ్‌కే ప్రభుత్వాలు ప్రెస్‌ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తున్నాయని స్టాలిన్‌ ఆరోపించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు