హత్య చేసి పూడ్చేశారు..?

4 Jan, 2020 10:18 IST|Sakshi
తమిళనాడు పోలీసులు శివకుమార్‌ను పట్టుకుపోవడంతో నిర్మానుష్యంగా ఉన్న ఇల్లు

తమిళనాడు పోలీసుల అదుపులో దంపతులు

చెన్నై వాసి అదృశ్యానికికారణమయ్యారనే అభియోగం

చర్చనీయాంశమైన సంఘటన

చిత్తూరు, కుప్పం రూరల్‌: ఓ వ్యక్తి అదృశ్యం కేసులో తమిళనాడు పోలీసులు మండలానికి చెందిన దంపతులను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అదృశ్యమైన వ్యక్తిని దంపతులు హత్య చేసి, పూడ్చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. కుప్పం మండలం, అడవిబూదుగూరు పంచాయతీ వినాయకపురం కాలనీకి చెందిన భార్యభర్తలు శివకుమార్, మాదేశ్వరి పొట్టకూటి కోసం చెన్నై వెళ్లి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి చెన్నైలోని శంకరానగర్‌కు చెందిన కార్తికేయన్‌ (40) అనే వ్యక్తి  పరిచయమయ్యాడు. కొంతకాలంగా వీరు కలిసిమెలిసి ఉండేవారు. రెండు నెలల క్రితం శివకుమార్, మాదేశ్వరి తమ స్వగ్రామానికి వచ్చేశారు. అయినా కార్తికేయన్‌ చెన్నై నుంచి వీరింటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల నుంచి కార్తికేయన్‌ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణలో కార్తికేయన్‌ తన సెల్‌ నంబర్‌ నుంచి శివకుమార్‌ దంపతులతో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. కార్తికేయన్‌ కనిపించకపోవడం వెనుక వీరి ప్రమేయం ఉన్నట్లు అనుమానించారు. దీంతో చెన్నై పోలీసులు శుక్రవారం వచ్చి వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.

వివాహేతర సంబంధం,ఆర్థిక లావాదేవీలే కారణమా?
కార్తికేయన్‌ మృతికి మాదేశ్వరితో ఉన్న వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్తికేయన్‌ మాదేశ్వరితో కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇది బెడిసి కొట్టిందని, మరోవైపు కార్తికేయన్‌ తానిచ్చిన డబ్బుల్ని తిరిగి ఇమ్మని కోరడంతో దంపతులిద్దరూ అతడిని వ్యూహం ప్రకారం అడవిబూ దుగూరుకు రప్పించి హత్య చేసినట్లు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో కార్తికేయన్‌ మృతదేహం?
కార్తికేయన్‌ చంపి ఇంట్లోనే పూడ్చినట్లు కొన్ని సామాజిక మాధ్యమాలు, టీవీ చానళ్లలో వార్తలు రావడంతో పంచాయతీలో ఇది దావానలంలా వ్యాపించింది. కార్తికేయన్‌ను హతమార్చి ఇల్లు లేదా పొలంలోనే ఖననం చేసినట్లు తమిళనాడు పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు తె లిసింది. ఈ క్రమంలో మృతదేహం ఆచూకీ తెలుసుకునేందుకు వారు స్థానిక పోలీసుల అనుమతి కోరారు. అయితే చెన్నై పోలీసులు తెచ్చిన రికార్డుల్లో అదృశ్యమైనట్లు ఉందని, హత్యకు గురైనట్లు లేదని,ఈ కారణంగా పోలీ సులు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో పూర్తి స్థాయి ఆధారాలతో తమిళనాడు పోలీసులు శని వారం కుప్పం రానున్నట్లు సమాచారం. పోలీ సుల దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు