తమిళిసై సెల్‌ఫోన్‌ చోరీ

16 Jun, 2019 08:41 IST|Sakshi

టీ.నగర్‌ : కేంద్ర మంత్రి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. కేంద్ర ఆహార భద్రత శాఖామంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ అనేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు శుక్రవారం చెన్నై వచ్చారు. ఎంఆర్‌సీనగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సహా అనేక మంది నేతలు విచ్చేశారు. సమావేశం జరుగుతుండగానే టేబుల్‌పైనున్న తమిళిసై సెల్‌ఫోన్‌ మాయమైంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తమిళిసై హాల్‌ అంతా వెతికిచూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పట్టినపాక్కం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కార్యక్రమం జరిగిన హాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు.

పోలీసు సెల్‌ఫోన్‌ చోరీ :
ఎంజీఆర్‌ నగర్‌లో పోలీసు కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌ శుక్రవారం చోరీకి గురైంది. ఎంజీఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా జయమాలిని (29) పనిచేస్తున్నారు. ఈమెకు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గస్తీ పని కల్పించారు. ఈ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా అశోక్‌నగర్‌లోని సినిమా థియేటర్‌ నుంచి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. మద్యం మత్తులో ఇద్దరు థియేటర్‌లో గొడవ పడుతున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. తర్వాత ఇద్దరిని విచారణ కోసం ఎంజీఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లారు. వారు నెసపాక్కానికి చెందిన వినోద్‌కుమార్, రామాపురం కన్నదాసన్‌నగర్‌కు చెందిన శరవణన్‌గా తెలిసింది. విచారణ అనంతరం ఇరువురిని పోలీసులు హెచ్చరించి పంపారు. కొద్ది సేపటి తర్వాత కానిస్టేబుల్‌ జయమాలిని తన సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్లు గుర్తించారు. స్టేషన్‌ అంతటా గాలించినా దొరకనందున సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. అందులో.. విచారణ కోసం తీసుకువచ్చిన వినోద్‌కుమార్‌ సెల్‌ఫోన్‌ తీసుకువెళ్లినట్లు తెలిసింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు