తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

8 Mar, 2018 07:18 IST|Sakshi
బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్న అదనపు డీసీపీ అశోక్‌ కుమార్‌

పోలీసులకు  చిక్కిన అంతర్‌రాష్ట్ర దొంగ

రూ.15 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేసినట్లు క్రైం అడిషనల్‌ డీసీపీ బి.అశోక్‌కుమార్‌ తెలిపారు. కొత్తగూడెం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కేతిరి రాము అలియాస్‌ కేదారి పార్థు.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనలకు పాల్పడుతున్నాడని ఆయన తెలిపారు.

నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. రాము ములకలపల్లి పరిసర గ్రామాల్లో చిక్కు వెంట్రుకలను అమ్ముకోవడం, కొనడం చేసేవాడు. 2007లో నిందితుడి తండ్రి మరణించడంతో స్నేహితులతో కలిసి  జల్సాలకు అలవాటు పడ్డాడు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో తన స్నేహితులతో కలిసి తొలిగిసారిగా విజయవాడ కృష్ణలంక, ఖమ్మం, ఇల్లందు, మహబుబ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ తీగను దొంగిలించాడు. 

2008లో జైలుకు..
రాము తన స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ విజయవాడ, ఖమ్మం పోలీసుకుల చిక్కి 2008లో తొలిసారి జైలుకు వెళ్లాడు. విజయవాడ, మహబుబ్‌నగర్‌ జిల్లా పోలీసులు పలుమార్లు జైలుకు పంపారు. నిందితుడు రాము తిరిగి 2013 నుంచి 2017 వరకు చిక్కు వెంట్రుకల వ్యాపారం చేసి.. ఆ తర్వాత క్రమంగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2017 డిసెంబర్‌ నుంచి భూపాలపల్లి జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు చోరీలు, వరంగల్‌ మామునూరు పీఎస్‌ పరిధిలో రెండు, పర్వతగిరిలో 2, కాజిపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలో 2 చోరీలకు పాల్పడ్డాడు.

దొంగిలించిన సొమ్మును విక్రయించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు సిద్ధమయ్యాడు. కాగా బులియన్‌ మార్కెట్‌లో రాము అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కైం ఏసీపీ బాబురావుకు వచ్చిన సమాచారంతో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ డెవిడ్‌రాజ్‌ తన సిబ్బందితో వెళ్లి రామును అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు అడిషనల్‌ డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన 512 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  

పోలీసులకు సీపీ అభినందనలు.. 
నిందితుడిని సకాలంలో గుర్తించి సొమ్మును రికవరీ చేసిన పోలీసులను సీపీ జి.సుధీర్‌బాబు అభినందించారు. అడిషనల్‌ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ బాబురావు, ఇన్‌స్పెక్టర్‌ డెవిడ్‌రాజ్, ఎస్సై బీవీ.సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, ఏఎస్సై వీరస్వామి, హెడ్‌ కానిస్టేబుళ్లు శివకుమార్, సుధీర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, వంశీని సీపీ అభినందించారు.  

మరిన్ని వార్తలు