ప్రజాప్రతినిధుల ఇళ్లే టార్గెట్‌

15 Nov, 2017 06:54 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న విలువైన పెన్ను, ఆభరణాలు

నిందితుడి అరెస్టు

రూ.23 లక్షల సొత్తు స్వాధీనం

బంజారాహిల్స్‌: ప్రజా ప్రతినిధులు, వారి సంబందీకుల ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. విశాఖ పట్నం పెందుర్తి కి చెందిన గౌరేష్‌ అలియాస్‌ పితాని ఆర్యన్‌ రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ బాపూనగర్‌లో ఉంటున్నాడు. 2013 నుంచి ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కిటికీలో నుంచి లోపలికి దూరి పూజామందిరాల్లో ఉన్న బంగారు, వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లేవాడు.  2015 జనవరి 17న నెల్లూరు ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తనయుడు బొల్లినేని ధనుష్‌ శ్రీనివాస్‌ ఇంట్లోకి ప్రవేశించి పూజా మందిరంలో ఉన్న 43 తులాల లక్ష్మి విగ్రహంతోపాటు వజ్రాల చెవి రింగులు దోచుకెళ్లాడు.

గత నెల 11న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లో రూ.2 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహం, బంగారు పూత కలిగిన పెన్ను ఎత్తుకెళ్లాడు.  జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 14లో వ్యాపారి డేగ విష్ణువర్ధన్‌రెడ్డి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ రావి శేషగిరిరావు నివాసాల్లో విలువైన వాచీలు, మహాలక్ష్మి విగ్రహం, హోం థియేటర్‌ సామాగ్రి ఎత్తుకెల్లాడు. నిందితుడి నుంచి రూ.23.10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2013లోనే జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు దొంగతనం కేసులు, రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఏసీపీ కేఎస్‌.రావు, ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచందర్, డీఐ కె. ముత్తు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు