వాటర్‌ప్లాంట్లపై దాడులు

25 Mar, 2018 09:13 IST|Sakshi
నీళ్ల నమూనాలు సేకరిస్తున్న అధికారులు

‘సాక్షి’ కథనానికి స్పందించిన టాస్క్‌ఫోర్స్, కల్తీనిరోధక శాఖ

 నీటి నమూనాలు సేకరణ

మంచిర్యాలక్రైం : జిల్లా కేంద్రంలోని పలు వాటర్‌ప్లాంట్లపై టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విజయసారథి, కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారి రవీంద్రచారి ఆధ్వర్యంలో శనివారం దాడులు చేపట్టారు. ఈనెల 19న ‘సాక్షి’లో ‘నీళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు పట్టణంలోని గంగోత్రి, జేఎస్‌ ఇండస్ట్రీస్, నేచర్‌ వాటర్‌ప్లాంట్లపై దాడులు చేసి నీటిశుద్ధి నిర్వహణ తీరును పరిశీలించారు. అనుమతి పత్రాలు తనిఖీలు చేశారు. పరీక్షల నిమిత్తం నీటి నమూనాలు సేకరించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పలువురు వాటర్‌ప్లాంట్లు నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. సేకరించిన నీళ్లలో కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ టీం, కల్తీ నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు