ఫిల్మ్‌నగర్‌లో డ్రగ్స్‌ కలకలం

1 Jun, 2019 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫిల్మ్‌నగర్‌లోని దుర్గాభవానీ నగర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫిలింనగర్‌ బస్తీలలో డ్రగ్స్‌ విక్రయ కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వైజాగ్‌కు చెందిన కడాలి భాస్కర్‌  అక్కడ తయారు చేసిన గంజాయి ద్రవ్యం(హ్యాష్‌ ఆయిల్‌) విషాల్, అభిలాష్‌ మత్తునిచ్చే టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం దుర్గాభవానీ నగర్‌లో గాలింపు చేపట్టారు. ఆ సమయంలో గంజాయి మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసేందుకు ముగ్గురు యువకలు రాగా పోలీసులు విక్రయిస్తున్న భాస్కర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఇటీవల గంజాయిని ద్రవరూపంలోకి మార్చి హ్యాష్‌ ఆయిల్‌ పేరుతో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. భాస్కర్‌ గత కొంత కాలంగా వైజాగ్‌ నుంచి సీసాల రూపంలో తీసుకొచ్చి ఒక్కో సీసాను ’ 2 వేలకు విక్రయిస్తున్నాడు. ద్రవరూపంలో ఉన్న గంజాయిని సిగరెట్‌లోకి జొప్పించి పీలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాల్, అభిలాష్‌అనే మరో ఇద్దరు మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డారు. భాస్కర్‌ నుంచి అయిదు హ్యాష్‌ ఆయిల్‌ సీసాలను, విశాల్‌ నుంచి పది వరకు ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు