టాస్క్‌ఫోర్స్‌ అదుపులో కోగంటి సత్యం

9 Jul, 2019 01:36 IST|Sakshi

రాంప్రసాద్‌ హత్య కేసులో విచారిస్తున్న పోలీసులు 

తనే చంపానంటూ లొంగిపోయిన బెజవాడ వాసి శ్యామ్‌ 

అతడితో పాటు ఇద్దరు అనుచరులు లొంగుబాటు 

హతుడి బావమరిది శ్రీనివాస్‌ సుపారీ ఇచ్చారని వెల్లడి 

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు 

సాక్షి, హైదరాబాద్‌ : పంజాగుట్టలో జరిగిన తెలప్రోలు రాంప్రసాద్‌ హత్యకేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యంను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి రాంప్రసాద్‌పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యం.. అక్కడినుంచే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన కోసం గాలించిన ప్రత్యేక బృందాలు హబ్సిగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. ఇదంతా జరుగుతుండగానే.. సోమవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు హఠాత్తుగా తెరపైకి వచ్చారు.

విజయవాడకు చెందిన టెక్కెం శ్యాంప్రసాద్‌ అలియాస్‌ శ్యామ్‌తో పాటు అతడి అనుచరులు ఛోటు, రమేష్‌ మీడియాకు రహస్య ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంలో శ్యామ్‌ మాట్లాడుతూ తానే మిగిలిన ఇద్దరితో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని వెల్లడించాడు. రాంప్రసాద్‌ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్‌ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్‌ బావమరిది ఊర శ్రీనివాస్‌ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రంగంలోకి దిగానని పేర్కొన్నాడు.  
 
ఆఫీసులో ఉంటాడని తెలిసే.. 
శనివారం రోజున పంజాగుట్టలోని కార్యాలయానికి రాంప్రసాద్‌ వస్తాడనే విషయాన్ని తమకు ఊర శ్రీనివాస్‌ చెప్పాడని శ్యామ్‌ వెల్లడించాడు. దీంతో హత్యకు పథకం వేశామని, విజయవాడలో ఉన్న తన వాటర్‌ ప్లాంట్‌లోనే మూడు కత్తుల్ని ప్రత్యేకంగా తయారు చేయించానని వెల్లడించాడు. వాటిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రాంతంలో బస చేశామని, దాదాపు 15రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే శనివారం రాత్రి కాపుకాసి కత్తులతో దాడి చేశామని వివరించాడు. హత్యానంతరం అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో ఎల్బీనగర్‌ మీదుగా విజయవాడకు వెళ్ళిపోయామని తెలిపాడు. సోమవారం లొంగిపోవాలని నిర్ణయించుకుని వచ్చామని శ్యామ్‌ చెప్పాడు. ఈ కేసుతో కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదన్నాడు.

విజయవాడకు చెందిన శ్యామ్‌పై అక్కడ రౌడీషీట్‌ కూడా ఉందని పోలీసులు చెప్పారు. గతంలో రాంప్రసాద్‌ కిడ్నాప్, హత్యాయత్నం కేసులో కోగంటి సత్యంతో కలిసి జైలుకు కూడా వెళ్ళాడంటున్నారు. ఈ కేసు తర్వాతే సత్యం ఇతడితో విజయవాడలోని తన కార్యాలయానికి పక్కనే వాటర్‌ ప్లాంట్‌ పెట్టించాడని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్యామ్‌ హఠాత్తుగా వచ్చి లొంగిపోవడం, హత్య కేసులో సత్యం పాత్ర లేదంటూ చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివృత్తి చేసుకోవడానికే సత్యంతో పాటు పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురినీ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క విజయవాడలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చిన కోగంటి సత్యం పెద్దల్లుడు కృష్ణారెడ్డిని కూడా ఇక్కడే ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు