‘ఉద్యోగం కావాలంటే.. ఫోటోల్లో అలా ఉండాలి’

23 Aug, 2019 18:37 IST|Sakshi

నిరుద్యోగ యువతులే లక్ష్యంగా ఉద్యోగాల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగం అంటూ ఆశ చూపి...వందలాది మంది యువతులను మోసం చేశాడో కేటుగాడు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి...ఆ తర్వాత నిజ స్వరూపం చూపించేవాడు. ఆకర్షణీయమైన ఉద్యోగం కావాలంటే శరీరమంతా కనిపించేలా ఫోటోలు పంపాలంటూ వేధింపులకు దిగాడు. చివరకు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడు కటకటాలపాలయ్యాడు. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి చెన్నైలోని టీసీఎస్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. యువతుల నగ్న చిత్రాలను సేకరించేందుకు పథకం పన్నాడు. ప్రముఖ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు.

ఉద్యోగం కావాలంటూ ఎవరైనా ప్రదీప్‌ను సంప్రదిస్తే... ‘ఈ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే .. ఆకర్షణీయమైన రూపం ఉండాలి. ఫ్రంట్‌, బ్యాక్‌, చెస్ట్‌ కనపడేలా ఫోటోలు పంపించాలి’ అని మాయమాటలు చెప్పేవాడు. ఫోటోల్లో ఆకర్షణీయంగా ఉంటేనే ఉద్యోగం సొంతమవుతుందని నమ్మించేవాడు. అతని మాటల్ని నమ్మి 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది యువతులు తమ ఫొటోల్ని పంపించారు. అయితే మియాపూర్‌కి చెందిన ఒక బాధితురాలికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు