వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ దాడి

7 Sep, 2019 05:18 IST|Sakshi
గాయపడిన కోటేశ్వరరావు

వినాయక నిమజ్జనం ఊరేగింపులో కవ్వింపు చర్యలు

చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోనూ మరోసారి ఎటాక్‌

గ్రామంలో 144 సెక్షన్‌ అమలు.. పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు

యడ్లపాడు (చిలకలూరిపేట) : వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం వేదికగా టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు వైఎస్సార్‌సీపీ వర్గీయులు గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం మైదవోలు గ్రామం బొడ్డురాయి సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ వర్గీయులు వినాయక చవితి పందిరి ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని గురువారం నిమజ్జనం చేసేందుకు మ.12 గంటల కు భారీ ఊరేగింపుతో బయల్దేరారు. దివంగత సీఎం వైఎస్సార్‌ పాటలతో ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ వర్గీయుడు బాసా నాగరాజును టీడీపీ వర్గీయుడు బాసా రాంబాబు కుమారుడు సైకిల్‌తో వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో నాగరాజు.. జనాన్ని చూసి వెళ్లమని వీపును చరుస్తూ చెప్పాడు.

అనంతరం  మైదవోలు–లింగారావుపాలెం గ్రామాల మధ్య ఉన్న పీబీసీ కెనాల్‌ వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. రాత్రి 8 గంటలకు నాగరాజు ఇంటిపైకి టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా వచ్చారు. తమ పిల్లవాడిని కొట్టారంటూ దుర్భాషలాడుతూ రాళ్లతో దాడికి దిగారు.  ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన బాసా నాగరాజు, కాసినబోయిన నాగేంద్రబాబులకు గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతలు యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చి బాధితులతో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. 

మరోమారు దాడి..
కాగా, అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఘర్షణకు దిగారు. సెంట్రింగ్‌ కర్రలు, పదునైన ఆయుధాలతో దాడిచేశారు. ఘటనలో బాసా కోటేశ్వరరావుకు తీవ్రంగా గాయాల య్యాయి. కడుపు భాగంలో లోతుగా తెగడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ టీడీపీ వర్గీయులు బాసా సర్వేశ్వరరావు, రామాంజనేయులు, రాంబాబు, పేరయ్య, శ్రీను, చిన్న శ్రీను, కోటేశ్వరరావు, చిన్న కోటేశ్వరరావులపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. కాగా పోలీసులు మైదవోలులో 144 సెక్షన్‌ విధించి పికెట్‌ ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు