ఎన్నికల్లో ఓడారు.. ఎంతకైనా తెగిస్తున్నారు

18 Sep, 2019 10:14 IST|Sakshi
టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కరణం రాజు కుటుంబం, (ఇన్‌సెట్లో) హత్యకు గురైన గండిపల్లి తవుడు

జిల్లాలో మొదలైన హత్యా రాజకీయాలు

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయంతో పేట్రేగిపోతున్న టీడీపీ

జిల్లాలో విషసంస్కృతికి పడుతున్న బీజం...

ఆందోళనలో జిల్లా ప్రజలు

ఓటమిని వారు భరించలేకపోతున్నారు. అధికారం కోల్పోవడంతో అసహనంతో ఊగిపోతున్నారు. ప్రతి చిన్న అంశాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అవకాశం దొరికిందే తడవుగా దాడులకు తెగబడుతున్నారు. ఉద్రేకంతో విచక్షణ కోల్పోతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకూ వెనుకాడటం లేదు. ఇదీ జిల్లాలో ఇటీవల తెలుగుతమ్ముళ్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమిని గెలుపునకు సోపానంగా మలచుకోవాలి. కానీ వారు సహనం కోల్పోయి విషసంస్కృతికి బీజం వేస్తున్నారు. ప్రశాంత జిల్లాలో లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు.

సాక్షి, విజయనగరం: ఓటమిని గుణపాఠంగా మలచుకోలేని తెలుగుదేశం కార్యకర్తలు దిగజారిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో  జిల్లావ్యాప్తంగా ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయిన టీడీపీ, ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ప్రతీకార చర్యలకు దిగుతోంది. ప్రజల మధ్య కులాలు, వర్గాల పేరుతో చిచ్చు పెడుతోంది. ఈ పరిణామాలు తాజాగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్యకు దారితీశాయి. జిల్లాలో ఎన్నడూ లేని విష సంస్కృతికి ఈ హత్యతో బీజం పడింది. ఇది రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాచిపెంట మండలంలోని పి.కోనవలస, మోసూరు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. పి.కోనవలసలో జరిగిన ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబం దెబ్బలతో తప్పించుకున్నారు.

మోసూరులో గండిపల్లి తవుడును టీడీపీ నాయకులు హతమార్చారని ఆరోపణలు ఉన్నాయి. పాచిపెంట మండలం మోసూరులో ఈ నెల  15వ తేదీన పశువుల కాపరి అయిన తవుడు సాయంత్రం ఆవులను కట్టిన తరువాత రాత్రి గ్రామంలోని బీసీ కాలనీలో  నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. నిమజ్జనం అయిన తరువాత అందరూ ఇళ్లకు చేరినా తవుడు ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని స్థానిక శివాలయం సమీపంలో తవుడు మృత దేహాన్ని గుర్తించారు. మృతుడి కుడి చేయి విరిగి ఉండడం, మెడ నులిపిన ఆనవాళ్లు ఉండడంతో ఆయనను హత్య చేసినట్లుగా అనుమానించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. తవుడును గ్రామంలోని పలువురు టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి ఆరోపిస్తుండగా విచారణ చేపట్టిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి  తీసుకున్నారు.

ఎన్నికల నుంచే అఘాయిత్యాలు
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రతీకార దాడులకు దిగడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల సమయంలోనూ, పోలింగ్‌ రోజున, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చోటుచేసుకున్నాయి. పి.కోనవలస గ్రామంలో సొంత అన్నదమ్ముల్లో చివరివాడైన కరణం రాజు ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సమక్షంలో చేరారు. ఈ క్రమంలో జూన్‌ 16న  స్థల సమస్యను సాకుగా చూపు తూ రాజు, ఆయన అత్త గౌరమ్మ, భార్య రమలపై రాజు అన్నదమ్ములు, వదినలు కర్రలతో దాడులకు పాల్ప డ్డారు. ఈ దాడిలో రాజు, గౌరమ్మకు తలలు పగిలాయి. రమ మెడలో పుస్తెల తాడు పోయింది. రాజు, గౌరమ్మలను సాలూరు సీహెచ్‌సీ నుంచి విజయనగరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వారి తలలపై కుట్లు పడ్డాయి. ఇప్పుడిప్పుడే వారు కోలుకుంటున్నారు.

అన్నపైనే... తమ్ముడి తప్పుడు ఫిర్యాదు
గంట్యాడ గ్రామంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న కొండపల్లి కొండలరావుపై ఆయన సోదరుడైన మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు తప్పుడు ఫిర్యాదులు చేశారు. జూలై 18న కొండలరావు తన తండ్రి వారసత్వంగా వచ్చిన గంట్యాడ రెవెన్యూ సర్వేనెంబర్‌ 12/1,12/2లో 16 ఎకరాలు మామిడితోటను ఆక్రమించుకున్నాడని అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించగా ఎటువంటి ఆక్రమణలు జరగలేదని తేలడంతో మాజీ ఎమ్మెల్యే దుర్భుద్ధి బయటపడింది.

కుంతేస్‌లో మహిళపై దాడి
కొమరాడ మండలం గిరిశిఖర గ్రామం అయిన కుంతేస్‌లో సుమారు 30 కుటుంబాలు ఉంటాయి. ఐదు కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి చెందడంతో కొంత కాలంగా వారిని టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇటీవల బిడ్డక మంజుల అనే వైఎస్సార్‌సీపీ మహిళ కార్యకర్త మంచినీటి బావి వద్ద గిన్నెలు శుభ్రం చేస్తుండగా పాత కక్షలతో టీడీపీ కార్యకర్తలు బచ్చల గోపిచంద్, పశుపురెడ్డి రాజేష్, కొండగొర్రి సహదేవుడు, పసుపురెడ్డి మిన్నారావు ఆమెపై తెగపడ్డారు. మంచి నీటి బావి వద్దకు వస్తే రూ.2 వేలు జరిమానా కట్టాలని నానా ఇబ్బందులు పెట్టారని విలేకరులకు తెలిపారు. ఈ వివాదంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి విషసంస్కృతి గతంలో లేదు
ఎన్నికల ముందు నుంచే టీడీపీ నేతల్లో అసహనం మొదలైంది. ఓటమి వారికి ముందే తెలిసిపోయింది. వైఎస్సార్‌సీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయినా మేము ఏనాడూ కుంగిపోలేదు. భయపడలేదు. ఈ విషయం అప్పట్లో అధికారంలో టీడీపీ నేతలందరికీ తెలు సు. మమ్మల్ని ఏమీ చేయలేక టీడీపీ వారు మరింత దిగజారిపోయారు. పార్వతీపురంలో తాగునీరు రావడం లేదని ఫిర్యాదు చేసిన ప్రజలపై ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ చేయిచేసుకున్నారు. ఎన్నికల రోజు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఏకంగా కార్యకర్తను హత్య చేసేంతగా పచ్చపార్టీ నేతలు బరితెగించారు. ఇలాంటి విష సంస్కృతి జిల్లాలో కొత్తగా చూస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు.
– మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త, విజయనగరం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా