మాజీ కౌన్సిలర్‌ కుమార్తెపై టీడీపీ నాయకుడి దాడి

12 Nov, 2018 08:00 IST|Sakshi
చికిత్స పొందుతున్న రమాదేవి

కత్తితో పొడవడంతో ఎడమ చేతికి 3 కుట్లు

ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు

ప్రకాశం , కందుకూరు అర్బన్‌: పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ మాజీ కౌన్సిలర్‌ కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. ఫలితంగా ఆమె ఎడమచేతికి 3 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం జరిగింది. క్షతగాత్రురాలి బంధువుల కథనం ప్రకారం..మున్సిపాలిటీలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్‌ పుష్ప కుమార్తె రమాదేవి వివాహం అనంతరం స్థానికంగా నివాసం ఉంటోంది. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్తూ తన అన్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు మాధవరావు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో టీడీపీ చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి మద్యం తాగి మాధవరావు ఇంటి ముందు నిలబడిఅసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. రమాదేవి నువ్వు ఎవరిని తిడుతున్నావని ప్రశ్నించింది.

మీ అన్ననే కావాలని తిడుతున్నానని సుధాకర్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. సుధాకర్‌ కత్తితో రమాదేవిని పొడవడంతో ఆమె ఎడమ చేతికి గాయమైంది. వెంటనే రామాదేవి తన అన్న మాధవరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని రమాదేవిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన సుధాకర్‌ తన తలను గోడకేసి కొట్టుకొని తనపై కూడా దాడి చేశారని పోలీసుస్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. బాధితులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సుధాకర్‌ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు ఆయనకు వత్తాసు పలికారు. కత్తితో దాడి చేసిన సుధాకర్‌ను వదిలి గాయపడిన బాధితురాలి అన్నతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసుస్టేష్టన్‌లో పెట్టారు. పోలీసులు తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ అన్యాయంగా తమపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని బాధితులు వాపోయారు. సుధాకర్‌ మాత్రం తనపై రమాదేవి బంధువులు దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయని ఆరోపిస్తుండటం గమనార్హం.  

మరిన్ని వార్తలు