మర్డర్‌ కేసులో మాజీ మంత్రి అరెస్ట్‌ 

4 Jul, 2020 03:55 IST|Sakshi

బందరు నుంచి పరారై తునిలో పట్టుబడ్డ టీడీపీ నేత కొల్లు రవీంద్ర

302, 109 సెక్షన్ల  కింద కేసు నమోదు

రవీంద్ర ప్రోద్బలం ఉన్నట్లు రూఢీ అయిందన్న కృష్ణా జిల్లా ఎస్పీ 

మోకా భాస్కరరావు హత్య కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం), సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు. గత నెల 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన మోకా భాస్కరరావు హత్యకేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్‌ చేయగా, కొల్లు రవీంద్ర పోలీసుల కళ్లు గప్పి పరారవుతూ తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులకు చిక్కారు. కొల్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మచిలీపట్నంకు తరలిస్తున్నట్లు సమాచారం. 

మంచి నాయకుడిగా మోకాకు గుర్తింపు 
మచిలీపట్నం ఉల్లింఘిపాలేనికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మోకా భాస్కరరావు పార్టీపరంగా, సామాజికపరంగా డివిజన్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఆయన ఆ సామాజికవర్గంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తూ మంచి నేతగా గుర్తింపు పొందాడు. గత ప్రభుత్వంలో టీడీపీకి చెందిన అప్పటి కౌన్సిలర్‌ చింతా చిన్ని అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర మద్దతుతో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. గుమటాలచెరువును ఆక్రమించుకుని ప్లాట్లుగా మార్చి అమ్మేసుకుని కోట్లు గడించాడు. భాస్కరరావు తరచూ  చింతా చిన్ని అవినీతిని ఎండగడుతూ ఉండేవాడు. ఇటీవల జరిగిన ఓ వివాదంలో సైతం చిన్ని అదే తరహాలో వ్యవహరిస్తుండటంతో మోకా అడ్డుకున్నాడు. చిన్నికి మద్దతుగా మాజీ మంత్రి కొల్లు పంచాయతీకి వెళ్లారు. వారి అవినీతిని మోకా అందరిలో ఎండగట్టాడు.  

కొల్లు ప్రోద్బలంతోనే హత్య? 
వార్డులో మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని  చిన్ని, తాను అక్రమ మార్గంలో ఎదగాలంటే మోకాను అడ్డు తొలగించటం ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాడు. తన సమీప బంధువులతో కలిసి మోకాను అంతమొదించేందుకు స్కెచ్‌ వేశాడు. మోకాను అంతమొందించేందుకు చిన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి మద్దతు కోరినట్లు పోలీసుల విచారణలో రూఢీ అయ్యింది.  రవీంద్ర ప్రోత్సాహంతో గత నెల 29న  చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్‌ పులి, చింతా కిషోర్‌ (మైనర్‌)లు చేపల మార్కెట్‌లో ఉన్న మోకాపై కత్తులతో దాడి చేసి పొడిచి చంపారు. అదే రోజు సాయంత్రం హత్య చేసిన ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వ్యవహారమంతా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సలహా మేరకే జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
ఆర్‌పేట స్టేషన్‌లో మాజీ మంత్రిపై కేసు నమోదు 
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కరరావు హత్య జరిగిందని మోకా బంధువులు ఆర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హత్యకు పాల్పడిన ముగ్గురితో పాటు కొల్లు రవీంద్రపైన 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మోకా హత్యకేసులో ఇప్పటికే ప్రధాన నిందితులైన చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు వారికి సహకరించిన నాగమల్లేశ్వరరావు, వంశీలను అరెస్ట్‌ చేశారు. నాలుగో నిందితుడైన కొల్లు రవీంద్ర పోలీసు కళ్లుగప్పి పరారయ్యారు.  
 
పరారై పట్టుబడ్డ కొల్లు  
శుక్రవారం మధ్యాహ్నం బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా నేతృత్వంలో పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేరు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన విశాఖ వైపు కారులో వెళ్లిపోతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో విజయవాడ –  విశాఖపట్నం రహదారులపై పోలీసులు నిఘా వేశారు. రవీంద్ర మొబైల్‌ సిగ్నళ్ల ఆధారంగా ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వద్దకు రాగానే వాహనాన్ని నిలిపివేసి, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయన్ని విజయవాడకు తరలించారు. ఇదిలా ఉండగా మోకా హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్‌ చేయాలంటూ ఉల్లింఘిపాలెం వాసులు శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు జిల్లా ఎస్పీని కలిసి కొల్లుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

అన్ని కోణాల్లో పరిశీలించాకే రవీంద్రపై కేసు 
మోకా భాస్కరరావు హత్యలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలం ఉన్నట్లు నిందితుల వాంగ్మూలంతోపాటు కాల్‌డేటా, సాంకేతిక అంశాల ద్వారా రూఢీ అయిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే రవీంద్రపై కేసు నమోదు చేశామని చెప్పారు. రవీంద్రపై అక్రమంగా కేసు బనాయించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా చట్టపరంగానే అన్ని చర్యలు చేపట్టామని సమాధానం ఇచ్చారు.  

మరిన్ని వార్తలు