తహసీల్దార్‌కు ‘కూన’ బెదిరింపులు

25 May, 2020 03:05 IST|Sakshi

అక్రమంగా మట్టి తవ్వుతున్న ఆయన సోదరుడు

ఆ వాహనాలు సీజ్‌ చేసినందుకే దూషణలు

ఇప్పటికే రెండుసార్లు అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రవికుమార్‌

బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే ధోరణి

పొందూరు: రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో రవికుమార్‌ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు.

సీజ్‌ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్‌ చేశావుగానీ కంప్లైంట్‌ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాను. తర్వాత మీరు రిలీజ్‌ చేసుకోండి సార్‌’ అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ‘ప్రాసెస్‌ గురించి నాకు చెబుతున్నావా..’ అంటూ రాయలేని రీతిలో ‘కూన’ అసభ్యంగా దూషించారు. దీంతో.. క్వారెంటైన్‌లో ఉన్న 13 మంది టీడీపీ వర్గీయులతో తనపై ఫిర్యాదులు చేయించారని తహసీల్దార్‌ రామకృష్ణ చెప్పారు. కాగా, కూన రవికుమార్‌ గతంలో కూడా ఇలాగే సరుబుజ్జిలి ఎంపీడీఓను.. అదే మండలానికి చెందిన పంచాయతీ విస్తరణాధికారిని బెదిరించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఆయన అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు.

మరిన్ని వార్తలు