రాజధానిలో రౌడీయిజం

25 Jan, 2018 12:20 IST|Sakshi
టీడీపీ నేత మాదాల శ్రీను (ఫైల్‌)

పంచాయతీ కార్యదర్శిపై దాడి

ఫిర్యాదుతో కేసు నమోదు

తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఘటన

కృష్ణాజిల్లా ,తుళ్లూరు: అధికార దర్పంతో టీడీపీ నేతలు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. ఈ సారి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండల పరిధిలోని మందడం గ్రామ  పంచాయతీ కార్యదర్శి గద్దె రామ్‌హనుమాన్‌పై టీడీపీ నేత ఒకరు  పంచాయతీ కార్యాలయంలోనే దుర్భాషలాటకు దిగడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. మందడం పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు కథనం మేరకు....మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత మాదాల  శ్రీనివాసరావు గతంలో తన స్థలాన్ని మరొక వ్యక్తికి తనఖా పెట్టాడు. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి హయాంలో ఈ స్థలానికి సంబంధించిన పన్ను రశీదులను మాదాల శ్రీనుకు ఇవ్వకుండా తన సోదరుడికి ఎలా ఇస్తారని ప్రస్తుత పంచాయతీ కార్యదర్శిపై సోమవారం మధ్యాహ్నం వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు  మంగళవారం 332, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే అనుచరుడిని అంటూ....
దీనికి తోడు టీడీపీ నేత మాదాల శ్రీను ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ అనుచరుడుని అంటూ.. మందడం, వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లోని ఖాళీ స్థలాను ఆక్రమించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో పనిచేసిన రెవెన్యూ, పంచాయతీ అధికారులపై సైతం బెదిరింపులకు    పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుత మందడం కార్యదర్శిపై దాడికి దిగి పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి దౌర్జన్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ కలగజేసుకొని వివాదాన్ని సద్దుమనిగించే  ప్రయత్నం చేశారని సమాచారం.

మండల పరిషత్‌ కార్యాలయంలో రాజీ కోసం మంతనాలు!
మంగళవారం తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో టీడీపీ నేత మాదాల శ్రీను బుధవారం ఉదయం నుంచే మండల పరిషత్‌ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులతో వచ్చి పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల వర్గంతో రాత్రి వరకు రాజీ కోసం మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. మాదాల శ్రీను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడు, మందడం గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు కావడంతో పార్టీ పరువు బజారున పడుతుందని ఓ స్థానిక టీడీపీ నాయకుడు ఈ వ్యవహారాన్ని జిల్లాకు చెందిన మంత్రి వద్దకు తీసుకెళ్లగా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని తెలిసింది. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు మాత్రం పట్టీపట్టనట్టు ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు