ఓటర్లకు డబ్బు పంచుతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు 

5 May, 2019 04:38 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు, రాయపాటి రంగారావు తదితరులు

రీ పోలింగ్‌ నిర్వహించే కేసానుపల్లి, గుంటూరు పశ్చిమలో ప్రలోభాలు 

కడియాల రమేష్‌ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కేసు లేకుండా టీడీపీ నేతల ఒత్తిడి 

నరసరావుపేట రూరల్‌/గుంటూరు ఈస్ట్‌: రీ పోలింగ్‌ నిర్వహించనున్న గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లిలో టీడీపీ నాయకులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసానుపల్లిలో టీడీపీ మండల నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కడియాల రమేష్‌ సహా నలుగురిని పోలీసులు శనివారం రాత్రి ఆదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని 94వ బూత్‌ పరిధిలో వైఎస్సార్‌ సీపీకి మంచి పట్టు ఉంది. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ మెజారిటీని తగ్గించేందుకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు పాల్పడుతున్నారు.

శనివారం రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో వారికి డబ్బులు పంపిణీ చేస్తుండగా.. ఎన్నికల విధుల్లో ఉన్న ఫిరంగిపురం ఎస్‌ఐ నారాయణ వారిని అదుపులోకి తీసుకుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, రాయపాటి రంగారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నారాయణ మాట్లాడుతూ ఎన్నికల నియామవళిని అతిక్రమించి గ్రామంలో పర్యటిస్తున్నందుకే టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై రూరల్‌ మాత్రం పోలీసులు నోరువిప్పడం లేదు.  

గుంటూరు పశ్చిమలో.. 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రీ పోలింగ్‌ను పురస్కరించుకుని టీడీపీ, జనసేన నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన పార్టీకి చెందిన చిగురుపాటి సతీష్, గడ్డం చిరంజీవి గుంటూరు నల్లచెరువు 24వ వార్డులోని 22వ లైనులో డబ్బు పంపిణీ చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి వారినుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు