చిత్తూరు బ్యాంకుపై టీడీపీ నేత భస్మాసుర హస్తం

14 Feb, 2020 11:50 IST|Sakshi
చంద్రబాబునాయుడుతో షణ్ముగం (ఫైల్‌)

చిత్తూరు బ్యాంకుపై టీడీపీ నేత భస్మాసుర హస్తం

అధికారులను బెదిరించి.. గుట్టుగా మోసం

నకిలీ బంగారంపై బ్యాంకు రుణాలు

రూ.1.20 కోట్లకు చేరుకున్న బకాయిలు

పోలీసులకు బ్యాంకు మేనేజరు ఫిర్యాదు

నిందితుడిపై 420 కేసు నమోదు

నిగనిగలాడే ఖద్దరు షర్టు. నలుగురిలో నిలబడితే ‘ఏం బ్రదర్‌’ అంటూ గంభీరమైన గొంతుసమావేశాల్లో ఊకదంపుడు ప్రసంగాలు.కారు రోడ్డుపైకి వస్తే హంగామావీటన్నింటికంటే మించితెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి.అతనే చిత్తూరు టౌన్‌బ్యాంకు చైర్మన్‌ షణ్ముగం.  సీన్‌ కట్‌చేస్తే..బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ కేసు.  

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు సహకార టౌన్‌ బ్యాంకులో భారీ మోసం వెలుగుచూసింది. గిల్టు నగలను బ్యాంకులో తాకట్టుపెట్టి ఏళ్ల తరబడి ఖాతాదారుల సొమ్ముతో జల్సా చేశారు. అధికారులను బెదిరించి.. మభ్యపెట్టి లోబరుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న పి.షణ్ముగం ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడంటూ బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం షణ్ముగంపై 420 కేçసు నమోదైంది. 

చిత్తూరు నగరంలోని సహకార టౌన్‌ బ్యాంకుకు మూడు శాఖలున్నాయి. వీటిలో దర్గా బ్రాంచ్‌ మేనేజరు పిఆర్‌.సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదులో.. ‘‘2014 నుంచి టౌన్‌ బ్యాంకు చైర్మన్‌గా షణ్ముగం కొనసాగుతున్నాడు. 2016–17వసంవత్సరంలో షణ్ముగం తనకు సంబంధించిన 12 మంది వ్యక్తులతో గిల్టు నగలు కుదువపెట్టాడు. అప్రైజర్‌ జీఎం.ధరణీసాగర్‌ను బెదిరించి 39 ఖాతాల్లో రుణాలు తీసుకున్నాడు. నన్ను గత ఏడాది 18వ తేదీ బదిలీ చేయించాడు. కొత్త మేనేజరుకు లెక్కలు చెప్పడానికి కుదువలో ఉన్న ఆభరణాలు పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. అప్రైజర్‌ను నిలదీయగా షణ్ముగం తనను బెదిరించి, ఉద్యోగం నుంచి తీసేస్తాని చెప్పి రుణాలు తీసుకున్నాడని చెప్పాడు. దీంతో నేను, అప్రైజర్‌ కలిసి షణ్ముగంను సంప్రదించాం. చైర్మన్‌గా నేనుండా మీకెందుకు భయం..? ఏదైనా సమస్య వస్తే నా ఆస్తులు అమ్మైనా డబ్బులు కట్టేస్తా అని మమ్మల్ని మభ్యపెట్టాడు. మాకు భయంవేసి పలు మార్లు షణ్ముగంను నిలదీస్తే ఇందులో నాకు సంబంధం లేదని, ఏంచేస్తారో చేసుకోండి అంటూ అడ్డం తిరిగి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’’ అంటూ మేనేజరు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇతర శాఖలపై అనుమానం
దర్గా బ్రాంచ్‌లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో నకిలీ నగలతో దాదాపు రూ.80 లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి వడ్డీ కలిపి రూ.1.20 కోట్లు పేరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇతర శాఖల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చని అధికారులు సందేహిస్తు్తన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా టీడీపీలో ఇద్దరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. వీళ్లకు రెండేళ్ల క్రితమే విషయం తెలిసినా షణ్ముగంను కాపాడుతూ వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

దర్యాప్తు చేస్తున్నాం
టౌన్‌బ్యాంకు చైర్మన్‌ షణ్ముగంపై ఆ బ్యాంకు మేనేజరు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశాం. ఐపీసీ సెక్షన్‌ 409, 417, 420 ఇతర సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడుతాం. – ఈశ్వర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా