వీపు వాతలు తేలేలా.. యూకేజీ పిల్లాడిపై టీచర్‌ కర్కశత్వం!

31 Oct, 2017 20:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కందుకూరు: చేతి రాత బాగా లేదని ఐదేళ్ల చిన్నారిని చితకబాదిందొక టీచర్‌. టీచర్‌ కొట్టిందని బిడ్డ చెప్పడంతో ఆవేదన చెందిన చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. కందుకూరు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన తల్లపనేని మాధవరావు కుమారుడు మనోభిరామ్‌ కందుకూరులోని శ్రీచైతన్య స్కూలు క్యాంపస్‌-2లో యూకేజీ చదువుతున్నాడు.

సోమవారం స్కూలుకు వెళ‍్లగా రైటింగ్‌ బాగా లేదంటూ అభిరామ్‌ను క్లాస్‌ టీచర్‌ స్వర్ణ బెత్తంతో తీవ్రంగా కొట్టింది. వీపు వాతలు తేలేలా కర్కశత్వం ప్రదర్శించింది. ఇంటికి వెళ్లిన మనోభిరామ్‌కు స్నానం చేయిస్తున్న సమయంలో వీపంతా వాతలు ఉండడాన్ని తల్లి గమనించింది. ఎలా జరిగిందని అడగగా స్కూల్‌లో టీచర్‌ కొట్టిందని చెప్పాడు. టీచర్‌ ప్రవర్తనపై ఽచిన్నారి తండ్రి మాధవరావు మంగళవారం ఉదయాన్నే పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఇన్‌చార్జి ఎస్సై ప్రభాకర్‌ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు