స్కూల్‌ బస్‌ ఢీకొనిఉపాధ్యాయుడి మృతి

14 Oct, 2017 09:25 IST|Sakshi
యల్లాగౌడ్‌ మృతదేహం

నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల. శుక్రవారం సాయంత్రం. పిల్లలు, ఉపాధ్యాయులు బయటకు వచ్చారు. స్కూల్‌ బస్సుల్లో ఎక్కుతున్నారు. అంతలోనే ప్రమాదం.. ఉపాధ్యాయుడికి త్రీవ గాయాలు.. ఆస్పత్రిలో మృతి. అసలేం జరిగింది..?

ఖమ్మంఅర్బన్‌: నగరంలోని ప్రయివేట్‌ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాలు...

ఖమ్మం రూరల్‌ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన అతని పేరు గైని యల్లాగౌడ్‌(24). నగరంలోగల పాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని, 5.00 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకని బస్టాండ్‌ వైపు వెళ్లే స్కూల్‌ బస్సు ఎక్కేందుకు మైదానంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మైదానంలో రెండు బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి. వాటి మధ్య నుంచి యల్లాగౌడ్‌ వెళుతున్నారు. అంతలోనే, ఒక బస్సు రివర్స్‌లో వెనక్కు వస్తోంది. అది యల్లాగౌడ్‌ను ఢీకొనడం, అలానే వెనక్కు నెట్టుకెళ్లడం, అక్కడే ఉన్న మరో బస్సును తగలడం.. క్షణాల్లోనే జరిగింది.

ఆ రెండు బస్సుల మధ్యన యల్లాగౌడ్‌ నలిగిపోయారు. రొమ్ము, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. ఇంతలో మరో ఉపాధ్యాయుడు వచ్చి, యల్లాగౌడ్‌ను ఆటోలో సమీపంలోగల మమత ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడే శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడి మృతికి సంతాపంగా పాఠశాలకు శుక్రవారం యాజమాన్యం సెలవు ప్రకటించింది.

‘బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం’
బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో యల్లాగౌడ్‌ మృతిచెందాడంటూ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడి బాబాయి కృష్ణయ్య శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసును సీఐ నాగేంద్రాచారి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు