కుటుంబం సహా ఉపాధ్యాయుడు ఆత్మహత్య

21 Jan, 2019 11:46 IST|Sakshi
కుటుంబసభ్యులతో ఉపాధ్యాయుడు ఆరోగ్యదాస్‌ (ఫైల్‌)

చెన్నై ,టీ.నగర్‌: కోయంబత్తూరులో నలుగురు కుటుంబ సభ్యులతో పాటూ ఉపాధ్యాయుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. కోయంబత్తూరు కరుమత్తంబట్టి అమలినగర్‌కు చెందిన అంతోని ఆరోగ్యదాస్‌ (37) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. అతనికి భార్య శోభన (30), కుమారుడు రితిక్‌ మైకేల్‌ (7), కుమార్తె రియా ఏంజలిన్‌ (1), తల్లి భువనేశ్వరి(65)తో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం చాలా సేపయినప్పటికీ ఇతని ఇంటి తలుపులు తెరుచుకోనందున ఇంటి యజమాని సాయంత్రం తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. పడక గదిలో అంతోని ఆరోగ్యదాస్‌ ఉరేసుకుని మృతిచెంది కనిపించాడు. పక్కన భార్య, తల్లి, పిల్లలు విషం సేవించిన స్థితిలో మృతదేహాలుగా పడిఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఎస్పీ పాండ్యరాజన్, డీఎస్పీ భాస్కరన్‌ పోలీసులతో అక్కడికి చేరుకుని ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.

సూసైడ్‌నోట్‌ లభ్యం
ఆరోగ్యదాస్‌ ఇంట్లో తనిఖీ చేయగా సూసైడ్‌నోట్‌ లభించింది. అందులో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తాను 12 ఏళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నానని, ఎన్ని మందులు వాడినా నయం కాలేదని తెలిపాడు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయానని, రుణాలు ఇచ్చినవారు తమను క్షమించాలని వేడుకున్నాడు. తనకు గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. అలాగే, అత్తమామలకు వేరొక లేఖ రాశాడు. అందులో తాను, కుటుంబాన్ని విడిచి వెళ్లలేకున్నానని, అందుకే భార్య పిల్లలను వెంట తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఐదుగురి మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు