ఉపాధ్యాయుడు కాదు.. ఉన్మాది

4 Nov, 2018 04:55 IST|Sakshi
శంకర్‌ నాయక్‌

తొమ్మిదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన ‘కీచక’ టీచర్‌

ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధింపులు

తిరస్కరించడంతో మెడపై కత్తితో దాడి

ఆపై తానూ ఆత్మహత్యాయత్నం

కర్నూలు: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఉన్మాదిగా మారాడు. ప్రేమించమంటూ విద్యార్థిని వెంటపడి వేధించాడు. అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెను క్షోభ పెట్టాడు. ఆ విద్యార్థిని ప్రతిఘటించడంతో.. కత్తితో గొంతుకోశాడు. ఈ ఘటన శనివారం కర్నూలులో జరిగింది. ఆత్మకూరు మండలం రాంపురానికి చెందిన శంకర్‌ నాయక్‌ కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని రాక్‌వుడ్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిగా కర్నూలులోని బంగారుపేటలో నివాసముంటున్నాడు. కాలనీకి చెందిన ఓ విద్యార్థిని రాక్‌వుడ్‌ స్కూల్‌లోనే తొమ్మిదో తరగతి చదువుతోంది. శంకర్‌నాయక్‌ కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ ఆ విద్యార్థిని వెంట పడి వేధిస్తున్నాడు.

ఆమె పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. శనివారం ఉదయం ఆమె తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన శంకర్‌ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపులు బిగించి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తన వెంట తీసుకెళ్లిన కత్తితో గొంతు కోశాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లేసరికి.. బాలిక తీవ్రగాయాలతో కిందపడి ఉంది.

జనం లోపలికి దూసుకురావడంతో భయపడిపోయిన శంకర్‌ నాయక్‌.. అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాలికను, నిందితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, నిందితుడిపై ఫోక్సో యాక్ట్‌ 307, 354డి, 354, 450, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ ఎస్‌ఐ జగన్‌ మీడియాకు తెలిపారు. ఈ ఘటన గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. 

మరిన్ని వార్తలు