ఉపాధ్యాయుడికి యావజ్జీవం

16 Nov, 2018 10:01 IST|Sakshi

13 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్, వివాహం, అత్యాచారం కేసులో కోర్టు తీర్పు

సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు 10 ఏళ్ల విద్యార్థినిపై కన్నేశాడు. బాలికకు 13 ఏళ్లు రాగానే కిడ్నాప్‌ చేసి బలవంతంగా వివాహం చేసుకుని అత్యాచారం చేసిన నేరాలపై తమిళనాడు కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. వివరాలు.. కడలూరు జిల్లా బన్రూట్టిలోని ప్రయివేటు మెట్రిక్‌ పాఠశాలలో 2016లో తిరువారూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక 9వ తరగతి చదివేది. ఇదే పాఠశాలలో రాజీవ్‌గాంధీ (33) గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సదరు బాలిక 6వ తరగతి చదువుతున్న కాలం నుంచే తరచూ ఆటపట్టించేవాడు. ఇదిలా ఉండగా,  2016 జూన్‌ 6వ తేదీన ఉదయం 8.30 గంటల సమయంలో సదరు బాలిక ఒక దుకాణంలో నోటుపుస్తకం కొనుక్కుంటోంది. ఆ సమ యంలో బాలికను తనతో రాకుంటే నీ తమ్ముడు, చెల్లిని చంపేస్తానని రాజీవ్‌గాంధీ బెదిరించాడు.

వెంటనే బాలికను తన మోటార్‌సైకిల్‌పై కిడ్నాప్‌ చేశాడు. బైక్‌లోనే తిరుపతికి తీసుకెళ్లి ఒక ఆలయంలో బలవంతంగా తాళికట్టాడు. అక్కడే ఒక రూము తీసుకుని అనేకమార్లు బాలికపై అత్యాచారం చేశాడు. కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు బన్రూట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలుసుకున్న రాజీవ్‌గాంధీ 2016 జూన్‌ 13న బాలికను సేలంలో బస్సు ఎక్కించి బన్రూట్టికి పంపివేశాడు. ఇంటికి చేరుకోగానే తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులు రాజీవ్‌గాంధీని గాలించి అరెస్ట్‌ చేశారు. కడలూరు జిల్లా మహిళా కోర్టులో ఈకేసు విచారణ పూర్తికాగా నిందితుడు రాజీవ్‌గాంధీకి న్యాయమూర్తి లింగేశ్వరన్‌ యావజ్జీవ కారాగారశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే మరో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు