కీచక ఉపాధ్యాయుడు.. పదో తరగతి విద్యార్థినిపై..

16 Feb, 2019 10:35 IST|Sakshi

విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన 

భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో ఘటన 

విచారణ జరిపిన అధికారులు 

భీమదేవరపల్లి: తండ్రి అంతటి వయసు.. మరో మూడేళ్లలో పదవి విరమణ..  కన్న కూతుర్లు వంటి విద్యార్థినులకు బోధించాల్సిన ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనకు బిత్తరపోయిన విద్యార్థిని బోరున విలపించింది. జరిగిన విషయాన్ని హెచ్‌ఎం ప్రభాకర్‌కుతో పాటుగా తల్లిదండ్రులతో చెప్పింది. కాగా ఈ సంఘటనను డీఈఓ దృష్టికి వెళ్లడంతో జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం కీచక ఉపాధ్యాయుడి ఘటనపై పాఠశాలలో విచారణ జరిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 37మంది విద్యార్థులున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో  విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన సాయంత్రం పాఠశాల ముగిశాక సాయంత్రం 5 గంటలకు ఆంగ్ల ఉపాధ్యాయుడు ఉప్పలయ్య 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులలో భాగంగా విద్యార్థులను గది వరండాలో కూర్చొబెట్టి చదివిస్తున్నాడు.

ఓ విద్యార్థినికి సందేహం రాగా గది లోపలనున్న ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లింది. దీంతో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినిపై చేతుల వేసి అసభ్యకరంగా ప్రవర్తించడంతో బిత్తరపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని  ఏడ్చుకుంటూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని తోటి విద్యార్థినులకు చెప్పింది. అనంతరం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ నెల 14వ తేదీన విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హెచ్‌ఎం ప్రభాకర్‌కు జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో హెచ్‌ఎం జరిగిన విషయాన్ని డీఈఓ నారాయణరెడ్డికి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా సెక్టోరియల్‌ అధికారి రమాదేవి,  ఎంఈఓ వెంకటేశ్వర్‌ను ఆదేశించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎంఈఓ, సెక్టోరియల్‌ అధికారి పాఠశాలకు వచ్చి విద్యార్థినితో పాటుగా ఇతర విద్యార్థులతో విచారణ జరిపారు. నివేదిక ఉన్నాతాధికారులకు సమర్పిస్తానని వారు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు