దొంగతనం చేసిందంటూ బాలికపై దాష్టీకం

27 Dec, 2018 09:12 IST|Sakshi

నిర్బంధించి చితకబాదిన వైనం

సంగం: డబ్బు దొంగిలించిందంటూ నేరం మోపి తనను ఉపాధ్యాయులు చితకబాదారని గురుకుల విద్యార్థిని బుధవారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరు తడికల బజారుకు చెందిన రాపూరు రమణయ్య, మునెమ్మల పెద్ద కుమార్తె నందిని.. సంగం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈ నెల 7న కళాశాలకు చెందిన అటెండర్‌ భువనేశ్వరి ఆఫీసు రూం నుంచి హాజరుపట్టిక తీసుకురమ్మని నందినిని పంపింది. నందిని వెళ్లి రిజిస్టర్‌ను తీసుకొచ్చి భువనేశ్వరికి ఇచ్చింది. కొంతసేపటి తర్వాత భువనేశ్వరి ఆఫీస్‌ రూంలో ఉంచిన తన హ్యాండ్‌ బ్యాగ్‌లో రూ.19,600 నగదు కనిపించట్లేదని.. నువ్వే తీశావంటూ నందినిని నిలదీసింది.

తనకు తెలియదని హాజరుపట్టిక మాత్రమే తెచ్చానని నందిని మొరపెట్టుకున్నా వినలేదు. పాఠశాల ప్రిన్సిపాల్‌ మార్గరేట్, గణితం ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఎన్‌ఎస్‌ ఉపాధ్యాయురాలు విజయ, మరో ఉపాధ్యాయురాలు నాగ లలిత, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మురళీ, అటెండర్‌ భువనేశ్వరి బాలికను గదిలో నిర్బంధించి చితకబాదారు. 21న నందిని తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి, వారికి విషయం చెప్పగా డబ్బులు తీసుకుని ఉంటే ఆ అమ్మాయి దగ్గర ఉండాలి కదా అని వారు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వారిని పంపించేసి నందినిని మరో గదిలో నిర్బంధించి 22న మధ్యాహ్నం వరకు కొడుతూనే ఉన్నారు. సెలవులు రావడంతో 22న సాయంత్రం నందిని తల్లిదండ్రులు కళాశాలకు వచ్చారు. వారిని రూ. 20 వేలు కట్టి నందినిని తీసుకుని వెళ్లాలని ప్రిన్సిపాల్, మరో ఐదుగురు ఉపాధ్యాయులు తేల్చిచెప్పడంతో, వారు తాము కూలి పని చేసుకునేవారమని బతిమిలాడి రూ. 5 వేలు నగదు భువనేశ్వరికి ఇచ్చి నందినిని తీసుకెళ్లారు.ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ నందిని, ఆమె తల్లిదండ్రులు రమణయ్య, మునెమ్మ సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు