పెళ్లి: మతం మార్పించి.. మొహం చాటేశాడు!

29 Sep, 2018 11:22 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన సఫ్దర్‌ అబ్బాస్‌ జైదీ

మల్కాజిగిరి: ఓ యువతిని పెళ్లి పేరుతో మోసగించి  ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని ఎల్‌ఓసీ(లుక్‌ అవుట్‌ సర్టిఫికెట్‌) ద్వారా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. ఎస్‌హెచ్‌ఓ మన్మోహన్‌ కథనం ప్రకారం..దారుల్‌షిఫాకు చెందిన సఫ్దర్‌ అబ్బాస్‌ జైదీ(28) దుబాయిలో 2014 నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు 2012 నుంచి దుబాయికి వెళ్లే వరకు హైటెక్‌ సిటీ ప్రాంతంలో పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయికి వెళ్లిన అబ్బాస్‌ కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని కూడా అక్కడికి పిలిపించుకొని ఉద్యోగంలో చేర్చాడు.

వివాహం చేసుకోవడానికి అబ్బాస్‌ తన తల్లితండ్రులను ఒప్పిస్తానని అందుకు మతం మారాలని నమ్మించి మత మార్పిడి చేయించాడు. అనంతరం వారిద్దరూ గతేడాది నగరానికి తిరిగి వచ్చారు. తల్లితండ్రులతో మాట్లాడానని  ఏప్రిల్‌ 17న పెళ్లి, 28న రిసెప్షన్‌ ఏర్పాటు చేశామని ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసి ఆ యువతిని నమ్మించారు. జనవరిలో దుబాయికి వెళ్లిన అనంతరం అబ్బాస్‌ ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ సంఘటనపై ఆ యువతి తల్లి ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ నిందితునిపై ఎల్‌ఓసీ జారీ చేశారు. ఈ నెల 27న నగరానికి వచ్చిన అబ్బాస్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్‌ అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 


 

మరిన్ని వార్తలు