సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

30 Oct, 2018 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వారిద్దరూ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అవమానం భరించలేక భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్‌ (34) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్‌కు చెందిన పావనితో అతడికి 2014లో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్‌కాలనీలోని పద్మజ మెన్షన్‌ అపార్ట్‌మెంట్‌ ఉంటున్నారు. ప్రశాంత్‌ గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఆమె వైఖరిలో మార్పు రానందున ఆత్మహత్య చేసుకుటున్నట్లు సూసైడ్‌నోట్‌ రాసిన ప్రశాంత్‌ ఆదివారం బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి లక్ష్మినర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పరువుపోయింది.. చచ్చిపోతున్నా..
ఆత్మహత్యకు వారం రోజుల ముందు తన బావతో ప్రశాంత్‌ ఫోన్‌లో మాట్లాడాడు. భార్య కారణంగా పరువుపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలను​కుంటున్నట్టు తన బావతో చెప్పాడు. తనకు మనశ్సాంతి లేకుండాపోయిందని, చచ్చిపోతేనే తనకు విముక్తి లభిస్తుందన్నాడు. ఆత్మహత్యకు పాల్పడవద్దని, చచ్చిపోయి సాధించేది ఏమి ఉండదని ప్రశాంత్‌ బావ నచ్చజెప్పారు. కావాలంటే విడాకులు తీసుకోవాలని సూచించారు.

కోడలిని కఠినంగా శిక్షించాలి
తమ కోడలు పావని కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. అవమానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. తమ కోడలిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. తోటి ఉద్యోగితో పావని వివాహేతరం సంబంధం పెట్టుకుందని, పద్ధతి మార్చుకోవాలని ప్రశాంత్‌ హితవు పలికినా ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడి పంపిస్తే భార్య మనసు మారుతుందన్న ఉద్దేశంతో భార్యను మూడు రోజుల క్రితమే బెంగళూరులో ఉద్యోగంలో చేర్పించినట్టు వెల్లడించారు.

అనుమానంతో హింసించాడు
లేనిపోని అనుమానంతో ప్రశాంత్‌ తనను నిత్యం మానసికంగా, శారీర​కంగా హింసించేవాడని పావని అంటోంది. అతడి చావుకు తాను కారణం కాదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు