#మీటూ ఎఫెక్ట్‌; టెకీ ఆత్మహత్య

20 Dec, 2018 18:23 IST|Sakshi
స్వరూప్‌ రాజ్‌ (పాత చిత్రం)

నోయిడా : తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తట్టుకోలేని ఓ టెకీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్‌ 137లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. స్వరూప్‌ రాజ్‌(35) అనే టెకీ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఇటీవల మీటూ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో స్వరూప్‌ తమను లైంగికంగా వేధించాడంటూ ఇద్దరు సహోద్యోగినులు అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీ యాజమాన్యం అతడిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో మానసిక వేదనకు గురైన స్వరూప్‌ తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన అతడి భార్య పోలీసులకు సమాచారం అందించింది. అతడి శవం వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.  

నీ భర్త తప్పు చేయలేదు...
‘నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మా కంపెనీలో ఇద్దరు మహిళలు నాపై నిందలు మోపారు. అయితే ఏదో ఒకరోజు అవి నిందలు మాత్రమే అనే విషయం నీతో పాటు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. అయినా నాకు నీతో, మన రెండు కుటుంబాలతో తప్ప ఎవరేమనుకున్నా సంబంధం లేదు. ఒకవేళ నేను నిర్దోషినని తెలిసినా సరే ఎంతో కొంత అనుమానం మీలో గూడు కట్టుకుని ఉంటుందని తెలుసు. అది నేను భరించలేను. అందుకే వెళ్లిపోతున్నా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో నీ భర్త ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఈ ప్రపంచం నన్ను ఎప్పుడూ అలాగే చూస్తుంద’ని స్వరూప్‌ తన భార్యను ఉద్దేశించి సూసైడ్‌ నోట్‌లో పలు విషయాలు రాసుకొచ్చాడు.
 

మరిన్ని వార్తలు