జాబ్‌ పోయిందని.. ఆన్‌లైన్‌లో విషం కొని

28 Sep, 2019 12:18 IST|Sakshi

ఇండోర్‌: సంతోషంగా, సజావుగా సాగుతున్న వారి కుటుంబ జీవన ప్రయాణం ఒక్క సారిగా తలకిందులైంది. ఇంటి యజమాని ఉద్యోగం పోవడంతో పాటు అప్పటివరకు దాచుకున్న డబ్బంతా బిజినెస్‌లో నష్టపోవడంతో ఆ కుటుంబానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకరమైన ఘటన ఇండోర్‌లో చేటుచేసుకుంది. ఈ ఘటనలో అభిషేక్‌ సక్సేనా(45), ప్రీతి సక్సేనా(42) వీరి కవల పిల్లలు అద్విత్‌(14), అనన్య(14)లు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన అభిషేక్‌ సక్సేనా కుటుంబం ఓ రిసార్ట్‌లో విగతజీవులుగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు వీరికి సంబంధించిన విషయాలను దర్యాప్తులో భాగంగా తెలుసుకున్నారు. అభిషేక్‌ సక్సేనా ఉద్యోగం పోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. 

నాలుగేళ్ల క్రితం ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వచ్చిన అభిషేక్‌ స్థానిక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అయితే గత కొద్ది నెలల క్రితం ఉద్యోగం పోవడం, ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో పెట్టిన పెట్టుబడులు నష్టాలు వాటిల్లడంతో అభిషేక్‌ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. మరోవైపు పిల్లల ఎదుగుదల, పోషణ, వారి చదువులు అభిషేక్‌కు భారంగా మారాయి. దీంతో అభిషేక్‌ తన 82 ఏళ్ల తల్లిని ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంచి కుటుంబ సభ్యులంతా కలిసి బుధవారం రిసార్ట్‌కు వెళ్లారు. అయితే రెండు రోజులైన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తమ దగ్గరున్న మాస్టర్‌ కీతో డోర్స్‌ ఓపెన్‌ చేసి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు జీవచ్ఛవాలుగా పడివున్నారు. దీంతో రిస్టార్ట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
 
నానమ్మతో అద్విత్‌, అనన్య (ఫైల్‌ ఫోటో)
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాటిల్‌ ఆన్‌లైన్‌లో  కొన్నట్లు వారి దర్యాప్తులో తేలింది. నలుగురు కావాలనే బలవన్మరణానికి పాల్పడ్డారా లేక తల్లిదండ్రులే మొదట పిల్లలకు విషమిచ్చి అనంతరం వారు తీసుకున్నారా లేక భార్య, పిల్లలను మొదట హత్య చేసి అనంతరం అభిషేక్‌ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు.. కొన్ని మెయిల్స్‌ కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు మరణించడంతో 82 ఏళ్ల అభిషేక్‌ సక్సేనా తల్లి కన్నీరుమున్నీరవుతోంది. 

మరిన్ని వార్తలు