టెకీకి చుక్కలు చూపించిన మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌

21 Nov, 2018 11:39 IST|Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ టెకీకి మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌ కంపెనీ ఒకటి చుక్కలు చూపించింది. పది రోజుల పాటు ఆ టెకీ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టింది. వివరాలు.. నోయిడాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి పూణెకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. ఈ క్రమంలో ఇంటిలోని వస్తువులను నోయిడా నుంచి పూణెకి తరలించడం కోసం ఓ మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌కి కంపెనీతో మాట్లాడి రూ. 61 వేలకి బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం గత నెల 24న ఇంటిలోని సామగ్రి, బట్టలు, ఇతర వస్తువులతో పాటు సర్టిఫికెట్లను కూడా ప్యాక్‌ చేసి ట్రక్‌లో ఎక్కించారు. ఈ సామగ్రి విలువ దాదాపు రూ. 12 లక్షల రూపాయలు ఉటుందని అంచాన. ఈ వస్తువులు నోయిడా నుంచి పూణెకి చేరడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పడుతుందని సదరు మూవర్స్‌ కంపెనీ యజమాని చెప్పాడు.

సామగ్రిని అంతా ప్యాక్‌ చేసిన తరువాత.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి ముందుగానే పూణె చేరుకున్నాడు. అనంతరం సామగ్రి కోసం ఎదురు చూడసాగాడు. చెప్పిన ప్రకారం నాలుగు రోజుల సమయం దాటిపోయింది. కానీ తమ సమాను మాత్రం పూణె చేరలేదు. దాంతో మూవర్స్‌ కంపెనీకి ఫోన్‌ చేస్తే వారు లిఫ్ట్‌ చేయలేదు. ఇలా దాదాపు పది రోజులు గడిచిపోయాయి. ఈ లోపు ట్రక్‌ డ్రైవర్‌ సదరు ఉద్యోగికి ఫోన్‌ చేసి ‘మా ఓనర్‌ మీ వస్తువులను నాశనం చేయమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీ సామాగ్రి అంతా మీకు క్షేమంగా చేరాలంటే నాకు మరో 30 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలం’టూ డిమాండ్‌ చేశాడు.

సహనం కోల్పొయిన సదరు ఉద్యోగి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. సదరు మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌ కంపెనీ ఓనర్‌, డ్రైవర్‌ ఇద్దరు ఒక్కరేనని తెలిసింది. అంతేకాక సదరు వ్యక్తి గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు సదరు ఉద్యోగిని అరెస్ట్‌ చేసి.. టెకీ సామగ్రిని అతనికి అందజేశారు.

మరిన్ని వార్తలు