బాలికపై వేధింపులు.. పోలీస్‌ స్టేషన్‌లో.. విషాదం

15 Jul, 2018 18:15 IST|Sakshi
న్యూఢిల్లీలోని తిలక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ : వేధింపులకు గురైన ఓ బాలిక ఇంటికి వెళ్లటం ఇష్టంలేక పోలీస్‌ స్టేషన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన న్యూఢిల్లీలోని తిలక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీకి చెందిన ఓ బాలికను పొరుగింటి వారు వేధింపులకు గురి చేయటంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలో వారు గొడవ పడ్డారు. తన వల్లే గొడవలు జరుగుతున్నాయని మనోవేదనకు గురైన బాలిక పోలీస్‌ స్టేషన్‌లోని ఓ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసు అధికారి విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విచారణ కోసం ఇరుకుటుంబాలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించామన్నారు. వారు గొడవ పడుతున్న సమయంలో బాలిక ఇంటికి పోవటానికి ఇష్టపడలేదన్నారు. దీంతో ఆమెను నారీ నికేతన్‌కు పంపించాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలిపారు. బాలిక తల్లి మాట్లాడుతూ.. తన కూతురిని పొరుగింటి వాళ్లు అపహరించి వేధింపులకు గురి చేశారని  ఆరోపించింది. వారి కొడుకుతో తన కూతురి పెళ్లి చేయటానికే ఇలా చేశారని తెలిపింది.   

మరిన్ని వార్తలు