హద్దుమీరి మద్యం విక్రయాలు

7 Mar, 2020 13:28 IST|Sakshi
ఇటీవల ఎక్సైజ్‌ దాడుల్లో పట్టుకున్న తెలంగాణ మద్యం

ఆంధ్రాలోకి యథేచ్ఛగా తెలంగాణ మద్యం

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

మామూళ్లమత్తులో ఎక్సైజ్, పోలీసు అధికారులు

ప్రభుత్వ ఆశయానికి తూట్లు

పశ్చిమగోదావరి, వేలేరుపాడు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ ఆదాయానికి గండిపడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా  సరిహద్దు గ్రామాలన్నీ   తెలంగాణాణ గ్రామాలకు ఆనుకుని ఉండటంతో దీనిని అవకాశంగా తీసుకుని మద్యం  వ్యాపారులు  యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక  దశలవారీ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే  ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త  ఎక్సైజ్‌ పాలసీ అమలవుతోంది. అయితే ఆశాఖ అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు ఆశయానికి  తూట్లు పడుతున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా అక్రమ మద్యం రవాణా అవుతున్నా, అరికట్టాల్సిన అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా  నామమాత్ర దాడులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు
తెలంగాణకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలానికి  పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో సరిహద్దు గ్రామాలు ఆనుకుని ఉన్నాయి. తెలంగాణలోని  దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు మండలాలు చింతలపుడి మండలానికి ఆనుకుని ఉండగా బూర్గంపహాడ్, ముల్కలపల్లి మండలం  తిమ్మంపేట కుక్కునూరు మండలానికి అత్యంత చేరువలో ఉన్నాయి.  ఆయా మండలాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా మద్యం రవాణా అవుతోంది. బూర్గంపహాడ్‌ నుంచి వయా  ఏలేరు మీదుగా  కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు  మద్యం సరఫరా చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో పోలీసు చెక్‌ పోస్టులున్నప్పటికీ  రవాణాను నియంత్రించలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

యథేచ్ఛగా బెల్ట్‌షాపుల నిర్వహణ
ఈ సరిహద్దు గ్రామాల్లో ఏకంగా మూడు నుంచి 12 బెల్ట్‌ దుకాణాలు వెలిశాయి. ప్రభుత్వం అనుమతించిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. పోలవరం ముంపు ప్రాంత మండలాలైన  వేలేరుపాడు, కుక్కునూరు   మండలాల్లోనే వందలాది సంఖ్యలో  బెల్ట్‌ షాపులు వెలిశాయి. ఈ బెల్ట్‌ షాపుల్లో సిట్టింగ్‌లు కూడా ఏర్పాటు చేశారు.

అరకొర దాడులతో సరి : అక్రమ మద్యం నిరంతరం రవాణా అవుతున్నా అరకొర కేసులు నమోదు చేసి అధికారులు  చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం మద్యం పాలసీని ఎంతో పకడ్బందీగా నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారోగ్యమే ధ్యేయంగా  సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో భాగంగా కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఈ క్రమంలో సర్కారు సంకల్పానికి అనుగుణంగా పనిచేయాల్సిన ఎక్సైజ్‌ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.  కొంతమంది ఇదే వ్యాపారాన్ని ఎంచుకొని లక్షలాది రూపాయలు  సంపాదిస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకొచ్చి జిల్లాలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల అధికారులు రూ.4 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని  పట్టుకున్నారు. కొంత మంది నాయకుల అండదండలతోనే ఈ అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.

30 కేసులు నమోదు చేశాం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఇప్పటి వరకు 30 ఎన్‌డీపీఎల్‌ కేసులు నమోదు చేశాం.  జిల్లా కేంద్రానికి సరిహద్దు   గ్రామాలు   దూరం కావడం, దీనికి తోడు  ఆరు మండలాలకు  ఒకే సీఐ, ఒకే ఎస్సై ఉండటంతో దాడులు చేపట్టడానికి కొంత ఇబ్బంది కలుగుతోంది. ఆయా మండలాల అధికారుల సహకారం తీసుకుని అక్రమ  మద్యం రవాణాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో వలంటీర్లు కూడా నిబద్ధతతో వ్యవహరించి అక్రమ మద్యం నివారించేందుకు సహకరించాలి.   – అనసూయాదేవి, ఉప కమిషనర్‌ ఎక్సైజ్‌ శాఖ

మరిన్ని వార్తలు