యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

9 Jun, 2018 09:01 IST|Sakshi
ఎక్సైజ్‌ దాడుల్లో దొరికిన తెలంగాణ బీరు బాటిల్‌ , సీఐ అన్నపూర్ణతో చర్చిస్తున్న యార్డు చైర్మెన్‌ నారాయణ, టీడీపీ నాయకులు

ఎక్సైజ్‌ దాడుల్లో దొరికిన తెలంగాణ బీరు బాటిళ్లు, మద్యం లూజు అమ్మకాలు

సీఐతో ఎమ్మెల్యే తనయుడు, యార్డు చైర్మెన్‌ వాగ్వాదం

హుటాహుటిన దుర్గానికి చేరుకున్న ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ ప్రణవి

అనంతపురం, కళ్యాణదుర్గం: ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో మద్యం దుకాణదారులు సాగిస్తున్న అక్రమ అమ్మకాలు బహిర్గతమయ్యాయి. నిబంధనలు తుంగలోకి తొక్కిన విషయాలు కూడా వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రం వ్యాప్‌తో తయారు చేసిన కింగ్‌ ఫిషర్‌ బీరు బాటిళ్లు లభించడం గమనార్హం. వివరాల్లోకెళితే... ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ అన్నపూర్ణ, ఎస్‌ఐ హరినాథ్‌ శుక్రవారం సాయంత్రం గాంధీచౌక్‌లోని మద్యం దుకాణం కళ్యాణి – 3పై దాడి చేశారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్‌తో ఉన్న కింగ్‌ఫిషర్‌ బీరుబాటిల్‌ కేస్‌ లభ్యమైంది. అంతేకాదు తక్కువ ధర మద్యంతో మొదలుకుని ఎక్కువ ధర మద్యం వరకు లూజు అమ్మకాలు కనిపించాయి. వాటిని ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు షాపు వద్దకు వెళ్లి హడావుడి చేశారు. కళ్యాణి మద్యం దుకాణాలు పట్టణంలో మూడు ఉన్నాయి. ఇవన్నీ యార్డు చైర్మెన్‌ నారాయణ, ఆయన అనుచరులు లక్కీ లాటరీలో దక్కించుకుని నడుపుతున్నారు. దీంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండా సీఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె ససేమిరా అనడంతో కొద్దిసేపు వాదనకు దిగారు. ఫలితం లేదని భావించి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుడు మారుతీ చౌదరిని ఎక్సైజ్‌ స్టేషన్‌కు రప్పించారు.

సీఐతో టీడీపీ నేతల వాగ్వాదం
కేసు నమోదు చేయకూడదంటూ ఎమ్మెల్యే తనయుడు మారుతీ చౌదరి, యార్డు చైర్మెన్‌ నారాయణ, కో ఆప్షన్‌సభ్యుడు మురళి, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ శ్రీనివారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ అన్నపూర్ణతో వాగ్వాదానికి దిగి రుబాబు చేశారు. దీంతో ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. చివరికి ‘కేసులు నమోదు చేస్తే ఏమవుతాయిలే...’ అంటూ నాయకులు వెళ్లిపోయారు. అయితే కేసుల నమోదు విషయంలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. స్టేషన్‌లో గందరగోళ పరిస్థితిని తెలుసుకున్న పెనుకొండ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రణవి హుటాహుటిన కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ అన్నపూర్ణ, స్థానిక ఎక్సైజ్‌ సీఐ సృజన్‌బాబులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లభ్యమైన బీరు, మద్యం బాటిళ్లను పరిశీలించారు. అయితే కేసు నమోదు విషయాన్ని తర్వాత చెబుతామంటూ అధికారులు జారుకోవడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు