తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

27 Apr, 2018 11:43 IST|Sakshi

బీజాపూర్‌: మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బీజాపూర్‌ జిల్లా ధర్మతాళ్లగూడెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్‌ దళాలు కూంబింగ్‌ చేపట్టాయి. సరిహద్దులోని భూపాల్‌పల్లి జిల్లా అన్నారం.. వెంకటాపురంలో మావోయిస్టుల జాడ కనిపించటంతో గ్రేహౌండ్స్‌ దళాలు మెరుపు దాడికి దిగాయి.

ఈ క్రమంలో మావోయిస్టులకు గ్రౌహౌండ్స్‌ దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు దంతెవాడ-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు గ్రామాలు అన్నారం-మర్రిమలలో గ్రేహౌండ్స్‌ దళాలు అడవిని జల్లెడపడుతున్నాయి. గడ్చిరోలి-సుక్మా ఎన్‌కౌంటర్‌లలో మృతుల సంఖ్య 40కి పైగా చేరుకున్న విషయం తెలిసిందే.

భారీగా మావోయిస్టుల లొంగుబాటు
ఓవైపు ఎన్‌కౌంటర్ల పర్వం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మావోయిస్టులు లొంగిపోతున్నారు. గురువారం అబుజ్‌మర్హ్‌కు చెందిన 60 మంది నక్సలైట్లు బస్తర్‌ ఐజీ ముందు లొంగిపోవటం చర్చనీయాంశంగా మారింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీరు తోడ్పాడునందిస్తామని ఈ సందర్భంగా ఐజీ వివేకానంద సిన్హా మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు