‘కిక్కు’రుమనడంలేదు

19 Nov, 2018 08:41 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : ఎన్నికల వేళ ఎవరు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయిలో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా విధుల్లో కొనసాగిస్తున్నారు. అయితే, ఈ పరిణామాలు ప్రలోభాలే ఆయుధంగా రంగంలోకి దిగిన అభ్యర్థులకు మింగుడు పడటం లేదు. ఏది ఎలా ఉన్నా ఎన్నికల తరుణంలో అభ్యర్థులు కొనుగోలు చేసే మద్యం ద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకుందామనుకున్న వైన్స్‌ యాజమానుల వారి పాచికలు పారడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని పథకం రచించిన వారు కూడా పటిష్ట నిఘాను దాటుకుని తీసుకురావడం ఎలా అన్న ఆలోచనతో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
 
ఎందుకొచ్చిన తంటా 
ఉమ్మడి జిల్లాలో సాధారణ మద్యం విక్రయాలు నెలకు రూ.వంద కోట్ల వరకు ఉంటాయి. గత ఎన్నికల సమయంలో విక్రయాలు 20శాతం అదనంగా జరిగాయి. ఇలా జరిగిన విక్రయాలకు లెక్కాపత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో మరో 10శాతం ఎక్కువగా అమ్మకాలు ఉంటాయని ఇన్నాళ్లు సంబరపడిన వైన్స్‌ యాజమానులు ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు బిగించిన ఉచ్చుతోఆందోళన చెందుతున్నారు. కొందరు మద్యం విక్రేతలు తమకు తెలిసిన నేతల వద్ద గోడు చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు ఏ సమస్యకైనా నేను ఉన్నా అని ధైర్యం చెప్పిన ఆ నాయకులు... మద్యం విషయానికొచ్చే సరికి ‘పరిస్థితులు బాగా లేవు.. నేను కూడా మద్యం జోలికి వెళ్లదలుచుకోవడం లేదు’ అంటూ సర్దిచెప్పి పంపుతున్నారు. ఈ సమయంలో తాను మద్యం జోలికి వెళ్లడంలేదు... మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెబుతుండడంతో వైన్స్‌ యాజమానుల ఆందోళనకు కారణమవుతోంది.

ప్రత్యేక దృష్టి 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు మద్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక యాప్‌లు ఇప్పటికే సిద్ధం చేసి వాటితో ఫలితాలు రాబడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతీ మద్యం సీసాకు లెక్క తేల్చేలా ట్రాకింగ్‌ సిస్టం, కంప్యూటరీకరణను ఉపయోగిస్తున్నారు. ఐఎంఎల్‌ డిపో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏ షాపుకు వెళ్లింది.. అమ్మకాలు ఏ మేరకు సాగాయనే ఆరా తీస్తుండడం.. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండడం గమనార్హం. ఇక గత ఏడాది నవంబర్‌లో ఎంత మద్యం విక్రయించారో అంతే స్థాయిలో విక్రయాలు ఉండేలా చూస్తుండడంతో ఇటు మద్యం వ్యాపారులు.. అటు పార్టీల అభ్యర్థులకు మింగుడు పడడం లేదు. 

మరిన్ని వార్తలు