మద్యం​ అక్రమ రవాణాపై ఉక్కుపాదం

26 Nov, 2018 06:43 IST|Sakshi

నేలకొండపల్లి:  త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడి వినియోగం, తరలింపుపై పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ వారు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల ద్వారా విస్తృత తనిఖీలు చేస్తూ కట్టడి చర్యలు చేపట్టారు. మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసులు నమోదు చేస్తూ, నిల్వలు స్వాధీనం చేసుకుంటూ ఎన్నికలకు ముందు ప్రశాంత వాతావరణం కోసం కృషి చేస్తున్నారు. జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిస్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాల ద్వారా..సోదాలు ఉధృతమవుతున్నాయి. లక్షల రూపాయల విలువ చేసే మద్యం పట్టుకున్నారు. అక్రమ అమ్మకాలకు సంబంధించి 532మందిపై కేసులు నమోదు చేశారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనధికారికంగా జరిగే సరఫరాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఇవన్నీ చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులకు సంబంధించి పోలీసులు, ఎక్సైజ్‌ శాఖల వారు మధిర, నేలకొండపల్లి, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్‌ తదితర కేంద్రాల్లో ఇలా ఉమ్మడిగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం, ఇతరత్రా రాకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఇక వైన్స్‌లలో కూడా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగితే..ఆ 
లెక్కలు ఆరా తీస్తున్నారు. తద్వారా ముందస్తుగా మద్యం నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్‌కు ముందు మద్యం అమ్మకాల బంద్‌ ఉండనున్న నేపథ్యంలో..ఆ రోజుల్లో సరఫరా జరగకుండా ఇప్పటినుంచే పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.. 
ఎన్నికల దృష్ట్యా మద్యం అక్రమ తరలింపు నివారణకు ప్రత్యేక టీంల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఏపీ రాçష్టం నుంచి ఎలాంటి అక్రమ మద్యం, ఇతరత్రా వస్తువులు రాకుండా నిరంతరం నిఘా పెంచాం. మద్యం దుకాణాల్లో కూడా పరిమితికి మించి అమ్మకాలు జరపకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ నిల్వలు, మద్యం సరఫరా విషయం తెలిసిన వారు మాకు సమాచారం అందించండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  – వి.సోమిరెడ్డి, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, ఖమ్మం

మరిన్ని వార్తలు