రుణం ఇవ్వాలని అడిగిన పాపానికి..

30 May, 2020 08:01 IST|Sakshi

సాక్షి, భీమిని(ఆదిలాబాద్‌) : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శుక్రవారం స్వయం సహాయక సంఘం మహిళలతో బ్యాంకు మేనేజర్‌ దిలీప్‌కుమార్‌ దురుసుగా ప్రవర్తించి ఒక సభ్యురాలిపై చేయి చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు గత రెండు వారాల నుంచి బ్యాంకుకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంకుకు వెళ్లి రుణాలు త్వరగా మంజూరు చేయాలని బ్యాంకు మేనేజర్‌ దిలీప్‌కుమార్‌ను కోరారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు జమ చేస్తున్నప్పటికీ రుణాలు ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారని ప్రశ్నించారు. దీంతో బ్యాంకు మేనేజర్‌కు, మహిళా సంఘాల సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది)

బ్యాంకు మేనేజర్‌ దిలీప్‌కుమార్‌ అసభ్యపదజాలం వాడుతూ మహిళా సంఘ సభ్యురాలిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆవేదనకు గురైన మహిళలు సిబ్బందిని బ్యాంకు లోపల ఉంచి తాళం వేసి రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఏఎస్సై మజారోద్దీన్‌ సంఘటన స్థలానికి వెళ్లి మహిళలను సముదాయించారు. సంఘ సభ్యురాళ్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘం సభ్యులు ఏదుల సుగుణ, వీవోఏ జాడి ధర్మయ్యలపై బ్యాంకు మేనేజర్‌ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కొమురయ్య తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు