రవిప్రకాశ్‌ కేసు విచారణ రేపటికి వాయిదా

10 Jun, 2019 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసు రేపటికి వాయిదా పడింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఈ రోజు(సోమవారం) హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రవిప్రకాశ్ దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.  అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) తమ వాదనలు వినిపిస్తూ..రవిప్రకాశ్‌ తన 9శాతం షేర్లలో 40 వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. మెజారిటీ షేర్‌హోల్డర్స్‌కు తెలియకుండా రూ. 99వేలకు టీవీ9 లోగోను రవిప్రకాశ్‌ అమ్మేశాడని కోర్టుకు తెలిపారు. కావాలనే శివాజీతో ఎన్‌సీఎల్‌టీలో కేసులు వేయించాడని ఆరోపించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు పిలిచిన హాజరు కాలేదని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు.   

సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు.  ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

మరిన్ని వార్తలు